Sakshi News home page

ఈవ్టీజింగ్ కేసులో కానిస్టేబుల్, హోంగార్డు అరెస్ట్

Published Wed, Oct 29 2014 2:55 AM

constable, home guard arrested in eve teasing case

సాక్షి, హైదరాబాద్ : ఒక పక్క హిళల రక్షణకు నగరంలో షీ టీమ్స్ రంగంలోకి దిగగా, మరోపక్క వారికి రక్షణ కల్పించాల్సిన ఇద్దరు ఖాకీలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డ ఉదంతమిది. బైక్‌పై కూర్చోవాలని, తమ వెంట రావాలని వారు ఇద్దరు మహిళలను రెండు రో జులుగా వేధిస్తుండడంతో కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు.  వివరాలు... కానిస్టేబుల్ శ్రీనివాసచారి(36), హోంగార్డు శ్రీను(24) కాచిగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. బర్కత్‌పురాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు వివాహిత మహిళలు ఉంటారు. వీరిద్దరు వ్యాయామం కోసం  స్థానికంగా ఉన్న ఓ జిమ్‌కు ఉదయం, సాయంత్రం వెళ్తుంటారు.

రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు జిమ్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా శ్రీనివాసచారి, శ్రీనులు బైక్‌పై వచ్చి వారిని ఎక్కాల్సిందిగా హెచ్చరించారు. వారి వూటలు వినకుండా మహిళలు వెళ్తుండగా వెంబడించి వేధించారు. ఇలాగే రెండు రోజులు కొనసాగించారు. దీంతో బాధితులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో స్పందించిన కాచిగూడ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. కాగా, కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పది మంది యువకులను షీ టీమ్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Advertisement
Advertisement