బాల్యం గుర్తుకొస్తోంది: సానియా | Sakshi
Sakshi News home page

బాల్యం గుర్తుకొస్తోంది: సానియా

Published Thu, Mar 3 2016 12:26 AM

బాల్యం గుర్తుకొస్తోంది: సానియా - Sakshi

అమెరికన్ బోట్లను ప్రారంభించిన టెన్నిస్ స్టార్
 
సిటీబ్యూరో: లుంబినీ పార్క్, హుస్సేన్ సాగర్‌లను సందర్శిస్తే తనకు చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్త్తున్నాయని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. తెంగాణ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె బుధవారం సాగర్‌లో అధునాతన అమెరికన్ బోట్లను ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పడవలను లాంఛనంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ, టూరిజం అధికారి సునీతా భగవత్ పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి ఆమె అమెరికన్ బోట్‌లో షికారు చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆధునిక బోటింగ్ నగరవాసుల్ని మరింత ఆహ్లాదపరుస్తుందని చెప్పింది. ఈ సౌకర్యాన్ని హైదరాబాదీలు వినియోగించుకోవాలని కోరింది. ‘మినీ ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్‌లో పుట్టి పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని ప్రాంతాల వారు, భిన్న వర్గాల వారికి నచ్చే ప్రాంతం హైదరాబాద్. ఇక్కడి వాతావరణం, సంస్కృతి అంటే నాకు బాగా ఇష్టం. ముఖ్యంగా ఇండోవెస్టర్న్ కల్చర్ ఇష్టం’ అని సానియా వివరించింది. త్వరలో నగరానికి రానున్న తన సహచర క్రీడాకారిణి మార్టినా హింగిస్‌కు ఇక్కడి టూరిజం ప్రదేశాలను చూపిస్తానని చెప్పింది. ఆమెకు హైదరాబాద్ చాలా ఇష్టమని, బిర్యానీ కూడా ఇష్టంగా తింటుందని తెలిపింది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement