తొంభై తొమ్మిది | Sakshi
Sakshi News home page

తొంభై తొమ్మిది

Published Wed, Jan 17 2018 12:07 AM

Special Story - Sakshi

ఒకానొక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. రాజ్య ధనాగారాలు ఎప్పుడూ సిరి సంపదలతో పొంగిపొర్లుతూ ఉండేవి. రాజుగారు కూడా అతి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయినా గానీ ఆయన ముఖంలో నిత్యం అసంతృప్తి తాండవిస్తుండేది! ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన రాజుకు, మందిర సేవకుడొకడు ఉల్లాసంగా పల్లె పదాలు పాడుకుంటూ పనిచేసుకోవడం కనిపించింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమీ లేనివాడు ఇంత సంతోషంగా ఉండటం ఏమిటి? అన్నీ ఉన్న తను అసంతృప్తితో జీవించడం ఏమిటి? అనుకున్నాడు. వెంటనే సేవకుడిని పిలిచి, ‘నీ సంతోషానికి కారణం ఏమిటి?’ అని అడిగాడు. 

అందుకు ఆ సేవకుడు వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా.. ఇది సంతోషం అని నాకు తెలీదు. అదే సంతోషమైతే కనుక అది తప్ప నా దగ్గర ఏమీ లేదు’’ అన్నాడు. 
రాజుకు ఆ సమాధానం సంతృప్తి కలిగించలేదు. ఆంతరంగిక సలహాదారును పిలిచి, ‘‘ఆ సేవకుడు ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు? నాకెందుకు అంత సంతోషం లేకుండా పోయింది’’ అని అడిగాడు. సలహాదారుకు విషయం అర్థమైంది. ‘‘మహారాజా.. ఆ సేవకుడు ‘తొంభై తొమ్మిది’ కూటమిలో సభ్యుడైనట్లుగా లేడు. అందుకే అంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు’’ అని చెప్పాడు. 

‘‘తొంభై తొమ్మిది అనే కూటమి ఒకటి ఉందా?’’ అడిగాడు రాజు ఆశ్చర్యపోతూ. ‘‘అవును మహారాజా, ఇప్పుడే ఆ సేవకుడిని ఆ కూటమిలో చేరుస్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూడండి’’ అని చెప్పి, ఆ తెల్లారే తొంభై తొమ్మిది బంగారు నాణేలు ఉన్న సంచినీ ఆ సేవకుడి ఇంటి గడప ముందు పెట్టించాడు సలహాదారు. 

సంచీని చూసి ఆశ్చర్యపోయిన సేవకుడు ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసుకుని నాణేలను లెక్కించి చూసుకున్నాడు. తొంభై తొమ్మిది నాణేలు ఉన్నాయి. అన్ని బంగారు నాణేలు ఉన్నందుకు సంతోషించకపోగా, ఇంకొక్క నాణెం ఉంటే నూరు నాణేలు అయి ఉండేవి కదా అని సేవకుడి మనస్సు ఉసూరుమంది. ఎలాగైనా సరే వాటిని నూరు నాణేలను చేయాలనుకున్నాడు. ఆ క్షణం నుంచీ మితిమీరి కష్టపడటం మొదలుపెట్టాడు. నూరో నాణేనికి అవసరమైనంత బంగారం కోసం డబ్బు కూడబెట్టడం మొదలు పెట్టాడు. సరిగ్గా తినడం మానేశాడు. 

ఇంట్లోవాళ్లను పట్టించుకోవడం మానేశాడు. పైగా వాళ్లేదైనా మాట్లాడుతుంటే వాళ్లపై చికాకు పడటం మొదలుపెట్టాడు. చివరికి ఆ సేవకుడు ఎప్పుడూ ఆ నూరో నాణెం గురించే ఆలోచిస్తూ సంతోషం అన్నదే మర్చిపోయాడు. ఇదంతా ఆంతరంగిక సలహాదారు ద్వారా విన్న రాజుగారికి తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిసింది. ఎక్కువ కోసం ఎప్పుడైతే మనలో ఆరాటం మొదలౌతుందో ఆ క్షణం నుంచే మనకు ఉన్నవన్నీ తక్కువైపోతాయి. సంతోషం, నిద్ర, ఆరోగ్యం, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడ్డం.. అన్నీ తగ్గిపోతాయి.

Advertisement
Advertisement