ఒక మనిషికి భయానికి మించిన రోగం ఏమిటి? | Sakshi
Sakshi News home page

ఒక మనిషికి భయానికి మించిన రోగం ఏమిటి?

Published Mon, Jan 1 2018 12:38 AM

fear is major Disease for humans - Sakshi

సుబ్బయ్యకు అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. మార్కెట్లో కూరలమ్మితో బెరుకు లేకుండా బేరం చేయలేడు. ఆఫీసులో సెలవు కావాలన్నా ధైర్యం చేసి అడగలేడు. చివరికి భార్యను కూడా ‘పులుసులో ఉప్పు జాస్తిగా ఎందుకు వేశా’వని అడగలేడు. అన్నింటా అంతటా భయమే. ఆ భయం వల్లే ‘ఒట్టి చచ్చుపెద్దమ్మ’ అనిపించుకుంటాడు. ‘నంగిరి పింగిరి’గాడిగా మాటలు పడతాడు. ‘సుబ్బయ్య ఈజ్‌ వెరీ ఇనెఫిషియంట్‌’ అని హెడ్‌క్లర్క్‌ రిమార్క్‌ పాస్‌ చేస్తాడు. ‘నాన్నకి అమ్మను చూస్తే భయం’ అని పుత్రరత్నం కృష్ణుడు కూడా రహస్యం కనిపెట్టేస్తాడు.
దుకాణంలో ఒకటి తాగుదామని వెళ్లి, దుకాణదారు ఇది బాగుంటుంది అని ఇచ్చేస్తే అదే మారు మాట్లాడకుండా పుచ్చుకునే రకం సుబ్బయ్య. తనకు ఇది కావాలి అని చెప్పలేడు. తనకు ఏది కావాలో దానికోసం నిలబడలేడు.

అట్లాంటి సుబ్బయ్య తన బావమరిది వెంకట్రావు అడగటం వల్ల తన దగ్గరికి బిల్లుల కోసం వచ్చే కాంట్రాక్టరు గవరయ్య దగ్గర ఐదు వందలు పుచ్చుకోవడానికి సిద్ధపడతాడు. ‘వాణ్ణి ఐదు వందలడుగు’ అంటాడంతే వెంకట్రావు. అతడు చెప్పిందాన్ని కాదనే ధైర్యం లేని సుబ్బయ్య, నేను తీసుకోను అని గట్టిగా చెప్పలేడు. దానివల్ల చాలా పెద్ద చిక్కులో పడిపోతాడు. ఈలోపు ఆఫీసులో జరిగిన స్థానభ్రంశం వల్ల సెక్షన్‌ మారిపోయి, గవరయ్య బిల్లులు చేయించలేకపోతాడు. కత్తి పదున్తో పనిచేసే గవరయ్య, జీవితం కొట్టిన దెబ్బలకు రాటుదేలిన గవరయ్య ఊరుకుంటాడా? అవకాశవాది బావమరిది అండగా నిలబడతాడా? ఇంటి అద్దె ఐదు రూపాయలున్న రోజుల్లో ఐదు వందలంటే ఎంత? సుబ్బయ్య నిలువెల్లా వణికిపోతాడు. ముచ్చెమటలు పోస్తాయి. గొంతు తడారి పోతుంది.
మనిషి దగ్గర మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవాలన్నా ధైర్యం కావాలి. ‘భయం బ్రతుకును దుర్భరం చేస్తుంది. భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూ కూడా మంచివారు కాజాలరు, మంచికి నిలబడలేరు’ అంటారు రావిశాస్త్రి.

స్వతహాగా మంచివాడే అయినప్పటికీ రక్తంలో భయం కలిసిపోయిన ఒక గుమస్తా కథ ‘అల్పజీవి’. తెగింపు కరువై బతుకును ఈడ్చే చాలామంది సుబ్బయ్యల కథ. రావిశాస్త్రి చేసిన గొప్ప మేలేమిటంటే, నవలను పూర్తి నిరాశగా ముగించకపోవడం. చివర్లో సుబ్బయ్యకు ఒక వెలుగులాంటి, మెరుపులాంటి స్నేహితురాలు మనోరమను పరిచయం చేస్తాడు. అది ఒక ప్రతీక. ఆమె కోసమైనా సుబ్బయ్య సంఘాన్ని ఎదిరించి నిలబడతాడా, గౌరవం ఇవ్వని భార్యతో కాపురం చేస్తూ మగ్గిపోతాడా అన్న సందేహం దగ్గర పాఠకుణ్ని వదిలేసి రచనను ముగిస్తాడు. చిన్న చిన్న వాక్యాలతో, వేగవంతమైన కథనంతో, మహా జోరుగా కథ నడుపుతాడు రావిశాస్త్రి. తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమ నవలల్లో అల్పజీవి ఒకటి. రావిశాస్త్రి బెస్ట్‌.

సాహిత్య మరమరాలు
నా పంక్తిన కవితా విశారద
విశాఖపట్నంలో భారతీ తీర్థ స్నాతకోత్సవం జరుగుతోంది. ఉపన్యాసాలు అయ్యాక బోటనీ లేబరేటరీ భవంతి పక్కన భోజనాలు మొదలైనాయి. పండితులందరూ అక్కడ కూర్చున్నారు. అక్కడ చోటు చాలక అబ్బూరి వరదరాజేశ్వరరావు వరండాలోకి వచ్చాడు. అక్కడ ‘నల్లగా పొడుగ్గా బొద్దు మీసాల్తో’ ఉన్న ఒకాయన కూర్చున్నారు. నిర్వాహకుల్లో ఒకరు ఆయనకు విస్తరీ, చెంబూ తెచ్చి పెట్టారు. అబ్బూరి వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాడు. అన్నం, కూర వడ్డన జరిగింది. రెండు నిమిషాల తరువాత ఆ పెద్దమనిషి ‘ఎవరబ్బాయివి నాయినా?’ అని పలకరించాడు. అబ్బూరి రామకృష్ణారావు వాళ్ల అబ్బాయినని చెప్పాక, మరి ‘ఇక్కడికి వచ్చి కూర్చున్నావేం?’ అన్నాడాయన. ‘ఇంకెక్కడా చోటు లేదండీ’ అన్నాడీయన. ఆయన నవ్వి ఊరుకున్నారు. మర్నాడు కరతాళ ధ్వనుల మధ్య ఆ పెద్దమనిషి పద్యపఠనం జరిగింది. అప్పటికిగ్గానీ ఆయన గుర్రం జాషువా అని అబ్బూరికి తెలియలేదు. సాయంత్రం జాషువాకు కవితా విశారద బిరుద ప్రదానం జరిగింది. అక్కడ అబ్బూరిని గుర్తించి, ‘నిన్న నువ్వు నా పక్కన కూర్చున్నందువల్ల నేను భోంచేయగలిగాను. నాలుక్కాలాల పాటు బతికి, నువ్వు కూడా కవిత్వం చెప్పు నాయనా’ అన్నారు జాషువా. ‘హరిజనుడని’ జాషువాను వేరే పంక్తిన కూర్చోబెట్టారు. అది తెలీక అబ్బూరి అక్కడ కూర్చున్నాడు. ఈ సంగతినే తర్వాత వాళ్ల నాన్నకు చెబితే, ‘భలే మంచి పనిచేశావురా’ అని మెచ్చుకున్నాడు.

Advertisement
Advertisement