ట్రంప్ అవివేకం
ఈ నిర్ణయంతో ఒప్పందానికి దూరంగా ఉన్న సిరియా, నికరాగువాల సరసన అమెరికాను చేర్చారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఏళ్ల తరబడి ఎంతో శ్రమించి, ఎన్నో విభేదాలను అధిగమించి ప్రపంచ దేశాలంతా రెండేళ్లక్రితం పారిస్ వేదికగా కుదుర్చుకున్న వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోదల్చుకున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఒప్పందానికి దూరంగా ఉన్న సిరియా, నికరాగువాల సరసన అమెరికాను చేర్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే పారిస్ ఒప్పందంపై తెలిసీ తెలియకా మాట్లాడిన ట్రంప్ అధ్యక్షుడయ్యాక కూడా దానిపై విమర్శలు చేయకపోలేదు. కానీ ఏదో ఒక స్థాయిలో ఆయనలో వివేకం మేల్కొనవచ్చునని కొందరు అంచనా వేశారు. కానీ తన అజ్ఞానం అభేద్యమైనదని ట్రంప్ నిరూపించారు. పారిస్ ఒప్పందం సాకారం కావడానికి అమెరికా నాయకత్వ పటిమ కారణమంటూ తనకు ముందున్న అధ్యక్షుడు ఒబామా సగర్వంగా ప్రకటిం చుకున్న వైనాన్ని ఆయన మరిచారు. వంక దొరకనమ్మ డొంక దారి పట్టినట్టు ఒప్పందం నుంచి పోతూ పోతూ భారత్‌పై నిందలేశారు.
పారిస్ ఒప్పందంపై ట్రంప్‌కున్న అభ్యంతరాలేమిటి? ఆయన దృష్టిలో ఒప్పందం చేసిన మహాపరాధం ఏమిటి? మధ్యలో భారత్‌పై కడుపుమంట దేనికి? భూగోళానికి మృత్యుపాశంగా మారిన కర్బన ఉద్గారాలకు మూలాలు అమెరికా, ఇతర అగ్రరాజ్యాల్లో ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి అంటూ ఆ దేశాలు పోటీపడి ఎడాపెడా శిలాజ ఇంధనాలను వినియోగించి పర్యావరణానికి పెను హాని కలిగించే మీథేన్, ఓజోన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వగైరాలను భూ వాతావరణం లోకి వదిలి మానవాళికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. ఇందువల్ల ఇప్పటికే ఉష్ణోగ్ర తలు అధికమై, జల కాలుష్యం, వాయు కాలుష్యం విస్తరిస్తూ సాంక్రమిక వ్యాధులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. సకాలంలో వర్షాలు లేకపోవడం, అకాలంలో కుండ పోతలు రావడం... పంటలు నాశనమై ఆహారసంక్షోభం రావడం కాలుష్యం పర్యవ సానమే. మంచు శిఖరాలు కరుగుతున్నాయి. పెను తుఫానులు చుట్టుముడుతు న్నాయి. ఏటా లక్షన్నరమంది కాలుష్యంవల్లే మరణిస్తున్నారు. ఇవి వందేళ్లపాటు వాతావరణంలో నిక్షిప్తమై ఈ నష్టాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. కర్బన కాలు ష్యంలో సంపన్న దేశాల వాటా 70 శాతం పైమాటేనని వివిధ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1850నాటి పారిశ్రామిక విప్లవంతో మొదలెట్టి 2011 వరకూ విడుదలైన కర్బన ఉద్గారాల్లో అమెరికా వాటా 27 శాతంపైనే! యూరప్ దేశాలన్నీ కలిసి 28 శాతం కాలుష్యానికి కారణం. ఇంత నష్టం చేసి కూడా పారిస్ ఒప్పం దంతో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నామని, అప్పనంగా డబ్బు ఇవ్వా ల్సివస్తున్నదని అనడం వంచనకాక మరేమిటి? పైగా మన దేశాన్ని ఉదాహ రించడమేమిటి?
ఈ వాదన ట్రంప్ పుర్రెలో కొత్తగా పుట్టిందేమీ కాదు. బొగ్గు వాడకంలో భారత్ మూడో స్థానంలో ఉన్నదంటూ పారిస్ ఒప్పందానికి చాన్నాళ్ల ముందే సంపన్న దేశాలు ఊదరగొట్టాయి. అవి చెప్పినట్టు మనం మూడో స్థానంలో కాదు... నాలుగో స్థానంలో ఉన్నాం. చూడటానికి రెండింటికీ పెద్ద తేడా ఏముందనిపిస్తుంది. కానీ అంకెలు చూస్తే అసలు నిజం తెలుస్తుంది. బొగ్గు వాడే దేశాల జాబితాలో అగ్ర స్థానం చైనాది (29 శాతం). ఆ తర్వాత అమెరికా (16శాతం), ఆపై యూరప్ (10శాతం) ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న మనం 5శాతం వినియోగిస్తున్నాం. పారిస్ ఒప్పందం 2020నాటికి మన బొగ్గు వాడకాన్ని రెట్టింపు చేసేందుకు అను మతినిచ్చిందంటున్న ట్రంప్‌కు లెక్కలు తెలియవనుకోవాలి. అప్పటికి నిజంగా మనం రెట్టింపు చేసుకోగలిగితే మన బొగ్గు వాడకం 10 శాతానికి చేరుతుంది. అంటే శతాబ్దంపైగా అమెరికా వినియోగించిన బొగ్గుతో పోలిస్తే మనం ఇన్నాళ్లుగా విని యోగించిందీ, ఇకపై వినియోగించేది అతి తక్కువ. పైగా పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించుకోవడంలో చురుగ్గా ఉన్నాం. పారిస్ ఒప్పందంలో పూచీ పడిన లక్ష్యంలో సగాన్ని ఈ రెండేళ్లలోనే సాధించగలిగాం. గతంతో పోలిస్తే మన దేశంలో సౌర శక్తి, పవనశక్తి యంత్రాల ధరలు గణనీయంగా తగ్గాయి. అంతే కాదు... ఆమోదం పొందిన 13.7 గిగావాట్ల బొగ్గు ఆధారిత ప్రాజెక్టులను రద్దు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులు మినహా కొత్తవాటికి అనుమతు ల్లేవు. ఇదంతా స్వీయ సంక్షేమం కోసం, మొత్తంగా మానవాళి ప్రయోజనం కోస మని భారత్ నమ్మింది. కనుకనే ట్రంప్ ప్రకటనకు స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని, ఇకపై కూడా దాన్ని త్రికర ణశుద్ధిగా పాటిస్తుందని చెప్పగలిగారు.
నిజానికి పారిస్ ఒప్పందం పకడ్బందీగా లేకపోబట్టే ట్రంప్‌లాంటి పాల కుడొచ్చి దాన్ని కాదనగలుగుతున్నాడు. ఏం చేయాలన్న అంశంలో అవగాహన కుదుర్చుకున్న దేశాలు... అందుకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణను, దాన్ని అమలు చేయకపోతే చెల్లించాల్సిన మూల్యాన్ని కూడా రాసుకుని ఉంటే వేరుగా ఉండేది. అదే జరిగితే ఒప్పందం నుంచి బయటికొచ్చినపక్షంలో అమెరికా భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చేది. పారిస్ ఒప్పందంపై 196 దేశాలు సంతకాలు చేయగా అందులో మన దేశంతోసహా 147 దేశాలు చట్టసభల్లో ధ్రువీ కరించాయి. ఒప్పందంపై మళ్లీ సంప్రదింపులకు అంగీకరిస్తేనే వెనక్కు వస్తానం టున్న అమెరికాను యూరప్ దేశాలన్నీ ఛీకొడుతున్నాయి. దాని అమలును పర్య వేక్షించేందుకు చైనా, యూరప్‌లు ముందుకొచ్చాయి. అసలు స్వదేశంలో ట్రంప్ మాటలు నమ్మి బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదనకూ, పరిశ్రమలకూ ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ ఉండకపోవచ్చునని మరికొందరి అంచనా. ముందూ మునుపూ ట్రంప్ తన పదవికి ముప్పు తెచ్చుకుంటే, ఆ తర్వాత వచ్చేవారు ఆయన నిర్ణయాలను బుట్టదాఖలా చేయరన్న గ్యారెంటీ ఏమిటన్నది వారి శంక. ఏతావాతా ఒప్పందం నుంచి పారిపోతే నష్టపోయేది అమెరికాయే. దెబ్బతినేది దాని విశ్వస నీయతే. తన పరువుప్రతిష్టలకు ట్రంప్ రూపంలో వచ్చిపడిన ముప్పును నివారిం చుకోగలిగేది ఆ దేశమే. చూద్దాం...ఏమవుతుందో!


