మిస్సింగ్‌ మిస్టరీ వీడేనా?

మిస్సింగ్‌ మిస్టరీ వీడేనా? - Sakshi


కానిస్టేబుల్‌ దామోదర్‌ ఆంజనేయులు ఎక్కడ?

22 ఏళ్ల కిందట విధి నిర్వహణలో అదృశ్యం

కుమారుడి ఆచూకీ కోసం తల్లి పోరాటం

పోలీసు ఉన్నతాధికారులకూ ఫిర్యాదు

నేటికీ కనిపించని ఆచూకీ

డీజీపీ, ప్రధానిలకూ లేఖ

కేసు సీఐడీకి అప్పగింత ప్రారంభమైన విచారణ




విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ మిస్సింగ్‌ అయ్యి 22 ఏళ్లు గడిచింది. ఇప్పటికీ ఆయన బతికి ఉన్నాడా లేదా అనేది ఎవరికీ తెలియదు.  కుమారుడి ఆచూకీ తెలపాలంటూ కానిస్టేబుల్‌ తల్లి పోలీసు అధికారులందరి చుట్టూ తిరిగింది. ఫలితం లేకపోవడంతో చివరకు బంధువులతో కలిసి డీజీపీ, ప్రధానమంత్రిలకు లేఖ పంపింది. దీంతో కేసు విచారణను సీఐడీ అధికారులకు అప్పగించారు.



విడపనకల్లు: కానిస్టేబుల్‌ దామోదర్‌ ఆంజనేయులు మిస్సింగ్‌ కేసు మిస్టరీగా మారింది. ఈయన స్వస్థలం కర్ణాటకలోని బళ్లారి. తండ్రి రైల్వే ఉద్యోగి. ఉద్యోగ రీత్యా అనంతపురం జిల్లా గుంతకల్లులో స్థిరపడ్డారు. 1993లో దామోదర్‌ ఆంజనేయులు పోలీస్‌గా ఎంపికై శిక్షణ తీసుకున్నాడు. 1994లో కానిస్టేబుల్‌గా మొదటి పోస్టింగ్‌ విడపనకల్లు పోలీస్‌స్టేసన్‌కు వచ్చింది. అప్పటి ఎస్‌ఐ గోపాల్‌ ఆదేశాల మేరకు ఆ ఏడాది ఆగస్టు 15న సహోద్యోగి రామాంజనేయులుతో కలిసి దామోదర్‌ ఆంజనేయులు పెట్రోలింగ్‌ విధులకు వెళ్లినట్లు రికార్డుల్లో ఉంది. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.



తన కుమారుడి ఆచూకీ తెలపాలని కానిస్టేబుల్‌ తల్లి కొల్లమ్మ ఆగస్టు 23న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తరువాత ఎస్‌ఐ బదిలీ కావడం.. కొత్తవారు దీని గురించి పట్టించుకోకపోవడంతో కేసు నీరుగారిపోయింది. తప్పిపోయిన వ్యక్తి ఏడేళ్లలోపు కనిపించకపోతే డెత్‌ (మరణించినట్లు)గా పరిగణించి కేసు మూసివేయవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కొత్తగా స్టేషన్‌కు వచ్చిన ఎస్‌ఐలు ఈ కేసును మూసివేయలేదు. ఈ క్రమంలో తల్లి, బంధువులు పోలీసు అధికారులను సంప్రదించి కానిస్టేబుల్‌ ఆచూకీ తెలపాలంటూ కోరుతూనే ఉన్నారు. అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు.



విధుల్లో ఉంటూ కనిపించకుండా పోయినా  తమ కుమారుడి ఆచూకీ ఇన్నేళ్లయినా తెలపకపోతే ఎలా అని కానిస్టేబుల్‌ తల్లి ఈ ఏడాది ఆగస్టు 23న ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఆర్వో నుంచి సీఐడీ అధికారులకు కానిస్టేబుల్‌ మిస్సింగ్‌ కేసును అప్పగించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తన బృందంతో కలిసి శుక్రవారం విడపనకల్లు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కానిస్టేబుల్‌కు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అనంతరం కానిస్టేబుల్‌ విడపనకల్లులో నివాసం ఉంటున్న అద్దె ఇంటిని పరిశీలించారు.  



అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం

1995లో విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన దామోదర్‌ ఆంజినేయులుకు సంబంధించిన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐడీ ఇన్స్‌పెక్టర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కేసు విషయమై విచారణకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.    తమ కుమారుడి ఆచూకీ తెలపాలని ఆంజినేయులు తల్లి కొల్లమ్మ ప్రధాన మంత్రికి, డీజీపీ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో తమకు ఈ కేసును అప్పజెప్పారని తెలిపారు. దామోదర్‌ 1993లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో సెలెక్టు అయి శిక్షణ తీసుకొని మొదటిసారిగా విడపనకల్లుకు కానిస్టేబుల్‌గా వచ్చారన్నారు.



విధి నిర్వహణలో 15 ఆగస్టు 1995లో అదృశ్యమై పోయినట్లు రికార్డులు చెప్తున్నాయన్నారు. దామోదర్‌ తల్లి విచారించాలని కోరడంతో 1995లో ఆగస్టులో అప్పటి ఎస్‌ఐ గోపాల్‌ కేసు నమోదు చేశారన్నారు. కేసుకు సంబంధించి సీడీ ఫైల్‌ రికార్డులు లేకుండా పోయాయని దీనిపై కూడా విచారణ చేస్తామన్నారు. అయితే దామోదర్‌ ఆంజినేయులుతో పాటు పనిచేసిన పోలీసులు చాలామంది చనిపోయారనీ, ఒకరో ఇద్దరో ఉన్నట్లు చెప్తున్నారని వారిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తామని తెలిపారు.



కానిస్టేబుల్‌ దామోదర్‌ ఏమయ్యాడు?

అదృశ్యమైన కానిస్టేబుల్‌ దామోదర్‌ ఆంజనేయులు ఏమయ్యాడో తెలపాలని బంధువు అయిన అనిల్‌కుమార్‌ పోలీసు అధికారులను కోరుతున్నాడు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన మామ అయిన దామోదర్‌ ఆంజనేయులు 1994లో విడపనకల్లు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేరారన్నాడు. విధి నిర్వహణలో ఉంటూ 1995లో కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా స్పందన లేకపోవడంతో ఈ ఏడాది మార్చిలో ప్రధాని, రాష్ట్రపతిలకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పాడు. అసలు దామోదర్‌ ఆంజనేయులు ప్రాణాలతో ఉన్నాడా.. లేక ఎవరైనా చంపేశారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయన్నాడు. మిస్టరీగా మారిన ఈ కేసును ఛేదించాలని విజ్ఞప్తి చేశాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top