సైబర్ నేరాల్లో ‘మనీ మ్యూల్స్‌’..

పోలీసుల అదుపులో నిందితులు - Sakshi


సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లు  ఆన్ లైన్ లో స్వాహా చేసిన నగదును ట్రాన్స్ ఫర్‌ చేయడానికి, డ్రా చేసుకునేందుకు వీలుగా ‘లోకల్‌ అకౌంట్స్‌’ను ఆశ్రయిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన పలువురికి ఎరవేసి వారి బ్యాంకు ఖాతాలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. సాంకేతికంగా మనీ మ్యూల్స్‌గా పిలిచే వీరికి ప్రతి లావాదేవీలోనూ 10 శాతం కమీషన్ గా ముట్టచెబుతారు. ‘ఐటీ కేసు’ దర్యాప్తులో భాగంగా సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురు మనీ మ్యూల్స్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి గురువారం ప్రకటించారు. ముంబైలో పట్టుకున్న వీరిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.అసలేం జరిగిదంటే...

నగరంలోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన షకేబా రజ్వీకి ఆగస్టు 30న ఆదాయపు పన్ను శాఖ పేరుతో ఓ ఈ–మెయిల్‌ వచ్చింది. అప్పటికే ఆమె దాఖలు చేసిన ఐటీ రిటర్నŠస్‌ ఫెయిల్‌ అయ్యాయని, రూ.19,246 రిఫండ్‌ రావాలంటే మరోసారి దాఖలు చేయమని అందులో ఉంది. దీంతో ఆ మెయిల్‌లో లింకుగా ఉన్న మరో వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయగా... ఐటీ డిపార్ట్‌మెంట్‌ పేరుతో ఉన్న సైట్‌ ఓపెన్  అయింది.


అందులో కోరినట్లుగా రజ్వీ తన డెబిట్‌కార్డ్‌ నెంబర్, సీవీవీ కోడ్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీలతో పాటు నెట్‌ బ్యాంకింగ్‌ విరరాలను పొందుపరిచారు. సదరు వెబ్‌సైట్‌ సైబర్‌ నేరగాళ్ళు క్రియేట్‌ చేసింది కావడంతో ఈ వివరాలన్నీ వారికి చేరిపోయాయి. నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఓటీపీ సాధారణంగా ఆమె సెల్‌ఫోన్ కు వస్తుంది. అయితే రజ్వీ వ్యక్తిగత వివరాల సాయంతో ఓటీపీ తన సెల్‌ఫోన్  నెంబర్‌కు వచ్చేలా మార్చేసిన సైబర్‌ నేరగాళ్ళు ఆమె ఖాతా నుంచి రూ.1.9 లక్షలు స్వాహా చేశారు.ప్రాథమికంగా చిక్కిన ‘మ్యూల్స్‌’...

తన బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన నగదు వివిధ ఖాతాలకు ట్రాన్స్ ఫర్‌ చేయడం ద్వారా స్వాహా చేసినట్లు సెప్టెంబర్‌ 2న గుర్తించిన రజ్వీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్ స్పెక్టర్‌ వీపీ తివారీ దర్యాప్తు చేశారు. ఆ నగదు ముంబైకి చెందిన మంగేష్‌ త్రిభువన్, అక్షయ్‌ అశోక్‌ నికమ్, యాసీన్  అహ్మద్‌ అలీ షేక్, ధనుంజయ్‌ సింగ్, అజీజ్‌ మునీర్‌ ఖాన్, ఠాకూర్‌ లక్ష్మణ్‌ సుపేకార్‌ ఖాతాల్లోకి బదిలీ అవడంతో పాటు డ్రా అయినట్లు గుర్తించారు.


దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం వారిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తమ ఖాతా వివరాలను ఫ్రాంక్‌ అలియాస్‌ రాజ అలియాస్‌ ఇంద్రేష్‌ హరి శంకర్‌ పాండేకు ఇచ్చామని, ప్రతి లావాదేవీలోనూ తమకు 10 శాతం కమీషన్  ఇస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇంద్రేష్‌ను పట్టుకుంటే సూత్రధారుల్ని గుర్తించే అవకాశం ఉందని చెప్తున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ తరహా మోసాలకు ఫిషింగ్‌ అంటారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొన్నారు.


ఇలా వచ్చే ఈ–మెయిల్స్‌ను ఓపెన్  చేసి వివరాలను పొందుపరిస్తే నిండా మునుగుతామని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఉండే లింకు ఓపెన్  చేస్తే ఆదాయపుపన్ను శాఖదిగా భ్రమించే వెబ్‌సైట్లు ఓపెన్  అవుతాయని, అవన్నీ సైబర్‌ నేరగాళ్ళ ఎత్తులుగా గుర్తించాలన్నారు. ఇలాంటి ఈ–మెయిల్స్‌ వస్తే నమ్మకుండా వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని సూచిస్తున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top