అవమానం భరించలేక యువతి ఆత్మహత్య | degree student commits suicide in karimnagar district | Sakshi
Sakshi News home page

అవమానం భరించలేక యువతి ఆత్మహత్య

Sep 17 2016 11:01 AM | Updated on Nov 6 2018 8:04 PM

అవమానం భరించలేక యువతి ఆత్మహత్య - Sakshi

అవమానం భరించలేక యువతి ఆత్మహత్య

చేయని తప్పుకు వీధిలో ఆడవాళ్లు సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బసంత్‌నగర్‌(కరీంనగర్‌): చేయని తప్పుకు వీధిలో ఆడవాళ్లు సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రామగుండం మండలం పాలకుర్తిలో జరిగింది. మృతురాలి బంధువులు, బసంత్‌నగర్‌ ఎస్సై విజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... పాలకుర్తి గ్రామానికి చెందిన సందవేన ఓదెలు–ఐలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కూతురు స్రవంతి(20) పెద్దపల్లిలోని ట్రినిటి డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన గణేశ్‌ నిమజ్జనోత్సవ ఊరేగింపులో వీధి యువతులతో కలిసి స్రవంతి నృత్యం చేసింది.

అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి యువతులను దుర్భాషలాడాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. గురువారం గ్రామానికి చెందిన కొంత మంది అతడిపై దాడిచేశారు. స్రవంతితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకే తాము దాడి చేసినట్లు వారు గ్రామంలో ప్రచారం చేశారు. దీంతో కొంత మంది మహిళలు సూటిపోటి మాటలతో స్రవంతిని మానసికంగా వేధించారు. భరించలేకపోయిన యువతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుంది. ఈమేరకు స్రవంతి  తల్లి ఐలమ్మ, సోదరుడు రమేశ్‌ బసంత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా స్రవంతి ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాసింది. ‘అమ్మనాన్నలు, అన్నయ్యలు దేవుళ్లు.. చేయని తప్పుకు అనవసరంగా కొంత మంది నన్ను బ్లేమ్‌ చేశారు.. దీని మూలంగా మా అమ్మానాన్నల పరువుపోతుంది. అమ్మానాన్నల పరువు తీసిన నాకు జీవితం ఉన్నా, లేకున్నా ఒక్కటే’ అని అందులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement