తరుముకొచ్చిన మృత్యువు | Sakshi
Sakshi News home page

తరుముకొచ్చిన మృత్యువు

Published Thu, Aug 9 2018 8:47 AM

Two Killed In Road Accident In Guntur - Sakshi

ప్రమాదంలో కాలిన లారీని తీసుకెళుతున్న రికవరీ వ్యాన్‌ను వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రికవరీ వ్యాన్‌ తలుపు ఊడడంతో డ్రైవర్‌ రోడ్డుపై పడ్డాడు. తాను లాక్కెళుతున్న లారీ చక్రాలు ఆయన మీదుగా వెళ్లడంతో అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఏఎన్‌యూ వద్ద హైవేపై బుధవారం చోటుచేసుకుంది.

పెదకాకాని : మృత్యువు ఎలా ముంచుకొస్తుందో .. ఎవరిని మింగేస్తో అంతు చిక్కదు. బుధవారం తెల్లవారుజామున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగిన ఓ ప్రమాదం మృత్యుదేవత వికటాట్టహాసానికి ఉదాహరణగా నిలిచింది. మూడు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం చెందారు. ఇందులో ఒకరు నేపాల్‌ నుంచి పొట్ట చేతిలో పట్టుకు రాగా, ఇంకొకరు బతుకుదెరువు కోసం తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడ్డారు. వివరాలు...పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడకు చెందిన రికవరీ వ్యాన్‌ (చెడిపోయిన లారీలను గమ్యస్థానానికి చేర్చే వాహనం) శ్రీ శైలం నుంచి అగ్నిప్రమాదంలో కాలిపోయిన టిప్పర్‌ లారీని విజయవాడకు బుధవారం తెల్లవారుజామున తీసుకొస్తోంది.

ఈ సమయంలో చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్డు తడిచి ముద్దగా ఉంది. సుమారు 4 గంటలకు రికవరీ వ్యాన్‌ పెదకాకాని మండల పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోకి చేరుకుంది. నల్గొండ జిల్లా వాడపల్లి నుంచి సిమెంట్‌ లోడుతో బయలుదేరిన లారీ...రికవరీ వ్యాన్‌ ఈడ్చుకెళుతున్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో సిమెంట్‌ లారీ ఎదురు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఇనుపబద్దెలు, రేకులు, స్టీరింగ్‌ మధ్య నలిగి డ్రైవర్‌ ఎండిగల నాగసత్యనారాయణ(50) సీటులోనే ప్రాణాలు ఒదిలాడు. ఒక్కసారిగా వెనుక నుంచి టిప్పర్‌లారీని సిమెంట్‌లారీ ఢీ కొనడంతో రికవరీ వ్యాన్‌ డోర్‌ ఊడిపోయి డ్రైవర్‌ సద్దాం (22) రోడ్డుపై పడ్డాడు. తాను ఈడ్చుకొస్తున్న టిప్పర్‌ చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సిమెంట్‌ లారీ డ్రైవర్‌ ఎండిగల నాగ సత్యనారాయణ(50) స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా గణపరం. ఇద్దరు కుమార్తెలను విజయవాడకు చెందిన వారికే ఇచ్చి వివాహం చేయడంతో సత్యనారాయణ దంపతులు కూడా ఇక్కడే కాపురం ఉంటున్నారు.

సత్యనారాయణ భార్య గత ఏడాదిగా అనారోగ్యంతో బాధ పడుతోంది.  నేపాల్‌ నుంచి బతుకుదెరువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు చేరిన రికవరీ వ్యాన్‌ డ్రైవర్‌ సద్దాంకు ఇంకా వివాహం కాలేదు. క్లీనర్‌ లాలుకుమార్‌ యాదవ్‌ కూడా నేపాల్‌కు చెందినవాడే. రికవరీ వ్యాన్‌ కండిషన్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పెదకాకాని పోలీసులు, హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంలో గాయపడిన లారీ క్లీనర్‌ శ్రీనివాసరావును, రికవరి వ్యాన్‌ క్లీనర్‌ లాలుకుమార్‌ యాదవ్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. మృతుని అల్లుడు ఆకుల వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆరోగ్యరాజు తెలిపారు.

1/1

లారీలోనే మృతి చెందిన డ్రైవర్‌ ఎండిగల నాగ సత్యనారాయణ

Advertisement
Advertisement