రూ.8వేలు.. ఇద్దరు ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

రూ.8వేలు.. ఇద్దరు ఉద్యోగులు

Published Thu, Dec 7 2017 8:53 AM

Industries department Officials Caught redhanded with demand bribery - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: అతనిది నిరుపేద కుటుంబం.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ట్రాక్టర్‌ కొనుగోలుకు ఉపయోగించుకోవాలనుకున్నాడు.. తద్వారా ఉపాధి పొందొచ్చన్నది ఆయన ఆశ.. కానీ మహబూబ్‌నగర్‌ పరిశ్రమల శాఖ అధికారులు ఆయన ఆశ తీరాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.. అలా ఏడాది పాటు ఆయనను తిప్పుకోగా.. విసిగి వేసారిన ఆ లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇంకేం.. వారు రంగంలో దిగి డబ్బు తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మాకేంటి..?
జడ్చర్ల మండలం లక్ష్మణ్‌నాయక్‌ తండాకు చెందిన రాంజీనాయక్‌ గత ఏడాది ఉపాధి నిమిత్తం కొత్త ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఆ వెంటనే సబ్సిడీ వస్తుందని తెలియడంతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు సబ్సిడీ మంజూరు చేస్తాం.. కానీ తమకేంటని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఐపీవో నర్సింగరావు రూ.10వేలు, జూనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ ఇనియాత్‌ అలీఖాన్‌ రూ.5వేలు డిమాండ్‌ చేశారు. ఇలా ఏడాది పాటు రాంజీ వారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినా డబ్బు ఇస్తేనే సబ్సిడీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. చివరకు ఆయన విజ్ఞప్తితో వారు చివరకు రూ.8వేలకు దిగొచ్చారు. అయినప్పటికీ మనస్సు అంగీకరించని రాంజీ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బుధవారం రంగంలోకి దిగిన వారు.. కార్యాలయంలో రాంజీ నుంచి డబ్బు తీసుకుంటున్న నర్సింగరావు, మహ్మద్‌ ఇనియాత్‌ అలీఖాన్‌ పట్టుకున్నారు. ఈ మేరకు వారిద్దరిపై కేసులు నమోదు చేయడంతో పాటు గురువారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ, సీఐ రమేష్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement