చివర్లో కొనుగోళ్లు | Sakshi
Sakshi News home page

చివర్లో కొనుగోళ్లు

Published Fri, Nov 24 2017 12:02 AM

Sensex, Nifty trade flat; IT stocks gain - Sakshi

ట్రేడింగ్‌ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో స్టాక్‌ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో వరుసగా ఆరో రోజూ స్టాక్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.   బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 27 పాయింట్ల లాభంతో 33,588 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,349 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 109 పాయింట్లు లాభపడగా, మరో దశలో 93 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 202 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 32 పాయింట్లు లాభపడగా, మరో దశలో 35 పాయింట్లు నష్టపోయింది.  

సానుకూలంగా ఫెడ్‌ మినిట్స్‌..: ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో మార్పులు చేయాలన్న కేంద్రం ప్రతిపాదన వల్ల ఇన్వెస్టర్లలో కొంత అలజడి రేగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. అయితే కొనసాగుతున్న సంస్కరణలు, రేట్ల పెంపు అంచనాల కంటే నెమ్మదిగానే ఉండనున్నదని అమెరికా ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడించడం సానుకూల ప్రభావం చూపాయని వివరించారు.  

నష్టాల్లో బీమా షేర్లు..
డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌పై ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో బీమా షేర్లు కుదేలయ్యాయి. పన్ను రేట్లలో మార్పులు జరిగితే అది బీమా కంపెనీల వేల్యూయేషన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులంటున్నారు.  
వెలుగులో ఐటీ షేర్లు..: అమెరికా ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌ 2.6 శాతం భారీగా లాభపడి రూ.991 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement