రికార్డ్‌ లాభాలకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ లాభాలకు బ్రేక్‌

Published Sat, Aug 25 2018 1:07 AM

Sensex loses 85 points, Nifty ends at 11557 - Sakshi

స్టాక్‌ సూచీల రికార్డ్‌ల లాభాలకు శుక్రవారం బ్రేక్‌ పడింది. ఇటీవలి రికార్డ్‌ల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధ నివారణకు ఉద్దేశించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, చమురు ధరలు పెరగడం, రూపాయి క్షీణత.. ఇవన్నీ  మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌85 పాయింట్లు నష్టపోయి 38,252 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 11,557 పాయింట్ల వద్ద ముగిశాయి.

బ్యాంక్, ఐటీ, వాహన షేర్లు నష్టపోగా, లోహ షేర్లు సపోర్ట్‌నిచ్చాయి. అమెరికా ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ శుక్రవారం రాత్రి కీలకోపన్యాసం సందర్భంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు లాభపడటం ఇది వరుసగా ఐదో వారం. ఈ వారంలో సెన్సెక్స్‌ 304 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు చొప్పున పెరిగాయి.  

257 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ 38,367 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో 93 పాయింట్ల లాభంతో 38,430 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. ఇటీవలి రికార్డ్‌ల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 164 పాయింట్ల నష్టంతో 38,173 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 257 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 51 పాయింట్లు పడిపోయింది.  

యస్‌ బ్యాంక్‌ 3.5 శాతం నష్టంతో రూ.375 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే కావడం గమనార్హం.

Advertisement
Advertisement