మెప్పించని ఆర్‌బీఐ సమావేశం | Sakshi
Sakshi News home page

మెప్పించని ఆర్‌బీఐ సమావేశం

Published Wed, Nov 21 2018 12:18 AM

Sensex falls 300 points, IT, metals stocks weigh - Sakshi

ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం ఫలితం మెప్పించలేకపోవడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. బ్రెగ్జిట్, వాణిజ్య ఉద్రిక్తతలు తదితర అంశాల కారణంగా ప్రపంచ వృద్ధి మందగమిస్తుందనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం మార్కెట్‌కు ప్రతికూలమైంది దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. డాలర్‌తో రూపాయి మారకం రెండు నెలల గరిష్టానికి చేరినా, ముడి చమురు ధరలు దిగొచ్చినా.. అవేవీ మార్కెట్‌పై ప్రభావం చూపించలేకపోయాయి. 

గత మూడు రోజుల లాభాల కారణంగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయి 35,475 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 107 పాయింట్లు పతనమై 10,656 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. లోహ, ఐటీ, ఫార్మా, షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

ఆర్‌బీఐ సమావేశం ఫలితం అంతంతే...!  
సోమవారం జరిగిన ఆర్‌బీఐ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విబేధాలను మరింత ముదరకుండా చేసినప్పటికీ, మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. బ్యాంక్‌ల మూలధన నిబంధనల విషయంలో ఉదారత చూపడం, చిన్న వ్యాపార సంస్థల రుణాల విషయంలో కూడా ఉదారత చూపే నిర్ణయాలను ఆర్‌బీఐ తీసుకుంది. ఆర్‌బీఐ నిర్ణయాలు ఫలితాలివ్వడానికి  దీర్ఘకాలం పడుతుందని నిపుణులంటున్నారు.

దీంతో తక్షణ పరిష్కారం ఆశించిన మార్కెట్‌కు ఆర్‌బీఐ బోర్డ్‌ నిర్ణయాలు మెప్పించలేకపోయాయని వారంటున్నారు. అంతేకాకుండా మూలధన నిధుల సమీకణకు మరింత గడువునివ్వడం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ప్రతికూలమేనని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మూడీస్‌ వ్యాఖ్యానించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. అంతేకాకుండా వ్యవస్థలోని ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం తగిన నిర్ణయాలను ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం తీసుకోలేదని మార్కెట్‌ వర్గాలు భావించాయి.

సెన్సెక్స్‌ 300 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.43 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.43 లక్షల కోట్లు తగ్గి రూ.141.54 లక్షల కోట్లకు చేరింది. 

Advertisement
Advertisement