మళ్లీ 32,000 పైకి సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ 32,000 పైకి సెన్సెక్స్‌

Published Wed, Sep 13 2017 12:11 AM

మళ్లీ 32,000 పైకి సెన్సెక్స్‌ - Sakshi

276 పాయింట్ల ర్యాలీ
► 87 పాయింట్ల లాభంతో నిఫ్టీ ముగింపు
► కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు


ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కూడా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ మరోసారి 32,000 మార్కును దాటింది. 276 పాయింట్ల లాభంతో 32,158.66 వద్ద క్లోజయింది. నిఫ్టీ సైతం 87 పాయింట్లు పెరిగి 10,093.05 వద్ద ముగిసింది. ఆగస్ట్‌ 1 తర్వాత నిఫ్టీ, ఆగస్ట్‌ 7 తర్వాత సెన్సెక్స్‌ ఈ స్థాయిలో ముగియడం తిరిగి ఇదే. కొరియా ఉపఖండంలో ఉద్రిక్తతలు చల్లబడడం, ఇర్మా హరికేన్‌ ప్రభావం అమెరికాపై తగ్గిపోవడం కలిసొచ్చింది. అమెరికా మార్కెట్లు సోమవారం నూతన గరిష్టాలను చేరుకోవడంతో ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ చోటు చేసుకుంది.

జూలై నెలకు సంబంధించి ఐఐపీ డేటా, రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ ముగిసిన తర్వాత విడుదలయ్యాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగియడం వరుసగా ఇది నాలుగో రోజు. దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు కొనసాగాయి. షార్ట్‌ పొజిషన్లను స్పెక్యులేటర్లు భయంతో కవర్‌ చేసుకోవడం వల్ల బుధవారం కూడా మార్కెట్లు ముందుకే వెళతాయని ట్రేడర్లు భావిస్తున్నారు. సూచీలోని టాటా స్టీల్‌ అత్యధికంగా 3.30 శాతం లాభపడి ఆరేళ్ల గరిష్ట స్థాయి రూ.683.15ని తాకింది.

టాటా స్టీల్‌ యూకే నుంచి 15 బిలియన్‌ పౌండ్ల విలువ జేసే బ్రిటీష్‌ స్టీల్‌ పెన్షన్‌ పథకంను వేరుచేసేందుకు కొత్త ఒప్పందానికి వచ్చినట్టు కంపెనీ ప్రకటన చేయడంతో ఈ కౌంటర్‌లో ర్యాలీ జరిగింది. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, హిందుస్తాన్‌ యునిలీవర్, ఎంఅండ్‌ఎం కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. రియల్టీ సూచీ 2.11 శాతం, హెల్త్‌కేర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు సైతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ జరిపాయి. చాలా వరకు ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరోప్‌ మార్కెట్లు సైతం సానుకూలంగానే ప్రారంభమయ్యాయి.

రూ.135 లక్షల కోట్లకు మార్కెట్‌ క్యాప్‌
బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మరోసారి కొత్త శిఖరాలకు చేరింది. సెన్సెక్స్‌ 32,000 మార్కును దాటడంతో మంగళవారం ఒక్క రోజే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1,25,126.92 కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.135,83,958 కోట్లకు చేరుకుని జీవిత కాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

ముందూ–వెనక్కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ఇంట్రాడేలో ఒక పరిణామం చోటు చేసుకుంది. దేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టీసీఎస్‌ను అధిగమించుకుని ముందుకు వచ్చింది. కానీ, మార్కెట్లు ముగిసే సమయానికి టీసీఎస్‌ తిరిగి రెండో స్థానానికి చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడో స్థానంలోనే ఉండిపోయింది.

మధ్యాహ్న సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ విలువ రూ.4,73,530.72 కోట్లకు చేరుకోగా, అదే సమయంలో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.4,72,733.32 కోట్లుగా ఉంది.  కానీ, క్లోజింగ్‌ ధర ప్రకారం టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.4,76,045.04 కోట్లకు చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ విలువ రూ.4,73,466.18 కోట్ల వద్దే స్థిరపడింది. దీంతో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.2,578.86 కోట్లు ఎక్కువగా ఉంది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.5,35,509.87 కోట్ల విలువతో దేశీయంగా నంబర్‌ 1 స్థానంలో ఉంది.

Advertisement
Advertisement