ఏప్రిల్‌లో ‘సిప్‌’ ద్వారా రూ.6,690కోట్లు | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ‘సిప్‌’ ద్వారా రూ.6,690కోట్లు

Published Fri, Jun 8 2018 1:26 AM

Investment Volume to Mutual Funds - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లలో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) వైపు అడుగులేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్‌లో సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.6,690 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన సిప్‌ పెట్టుబడులు రూ.4,269 కోట్లతో పోలిస్తే 57 శాతం అధికం. 2017–18లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సిప్‌ ద్వారా మొత్తం మీద రూ.67,000 కోట్ల నిధులు వచ్చాయి. 2016–17 సంవత్సరంలో ఇలా వచ్చిన పెట్టుబడులు రూ.43,900 కోట్లుగా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే దేశీయంగా ఇన్వెస్టర్లలో మ్యూచువల్‌ ఫండ్స్, సిప్‌ పట్ల అవగాహన విస్తృతమవుతోందని తెలుస్తోంది.

ఈక్విటీ ఫండ్స్‌ బలమైన పనితీరుకు తోడు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి చేపట్టిన అవగాహన చర్యలే అధిక సిప్‌ పెట్టుబడులకు కారణమని ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాధికా గుప్తా పేర్కొన్నారు. కాలానుగుణంగా మార్కెట్‌ రిస్క్‌ తగ్గించేందుకు సిప్‌ ఉపయోగపడుతుందని, దాంతో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది ప్రాధాన్య సాధనంగా మారిందని ఆమె చెప్పారు. అదే సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు సంప్రదాయ సాధనాలైన రియల్‌ ఎస్టేట్, బంగారంలో పెట్టుబడుల పట్ల ఆసక్తిగా లేరని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకు సంబంధించి మొత్తం మీద 2.16కోట్ల సిప్‌ అకౌంట్లు ఉన్నాయి. ప్రతీ వారం, నెల, త్రైమాసికం వారీగా నిర్ణీత మేర పెట్టుబడులకు ఉపయోగపడే వాహకమే సిప్‌.  

Advertisement
Advertisement