Sakshi News home page

ఎమ్మెల్యే దామచర్ల vs జెడ్పీ చైర్మన్‌ ఈదర

Published Sun, Feb 5 2017 12:40 PM

ఎమ్మెల్యే దామచర్ల vs జెడ్పీ చైర్మన్‌ ఈదర - Sakshi

జెడ్పీ స్థలం పేరుతో దామచర్ల ద్విముఖ వ్యూహం
కరణం సూచించిన స్థలానికి నో
ఈదర టీడీపీలోకి రాకుండా చెక్‌పెట్టే ఎత్తుగడ
జెడ్పీ స్థలం కోసం డిమాండ్‌  
పని జరిగితే క్రెడిట్‌  తనకు..  
కాకుంటే హరిబాబును ఇరికించే ఎత్తుగడ
ఆది నుంచి ఈదరను అడ్డుకుంటున్న దామచర్ల
జెడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి అన్ని ప్రయత్నాలు సాగించిన వైనం


ఒంగోలు : ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి జెడ్పీకి చెందిన 1.60 ఎకరాల స్థలం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబును కోరారు. పైగా ఈ నెల 10న జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయించాలని జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. తొలి నుంచీ దామచర్లకు, ఈదర హరిబాబుకు మధ్య పొసగడం లేదు. ఇందుకు జిల్లా పరిషత్‌ ఎన్నికల ఎపిసోడ్‌ వేదికైంది. జెడ్పీ ఎన్నికల రగడలో  హరిబాబును పార్టీ నుంచి బహిష్కరించడం వెనుక దామచర్ల కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఈదర తిరిగి పార్టీలో చేరాలన్న క్రమంలోనూ దామచర్లే అడ్డకుంటున్నట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.

ఈదర చైర్మన్‌గా పదవి చేపట్టి రెండున్నరేళ్లు దాటింది. అవిశ్వాస తీర్మానానికి నాలుగేళ్ల గడువున్నా రెండున్నరేళ్ల కాలపరిమితిలో అవిశ్వాసం పెట్టి హరిబాబును పదవీచ్యుతుడిని చేయాలని ఎమ్మెల్యే జనార్దన్‌ తీవ్రంగా ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రితో పాటు సీఎం పేషీకి చెందిన సతీష్‌చంద్రపై ఒత్తిడి తెచ్చారు. అవిశ్వాసానికి ప్రత్యేక జీవో సైతం తెచ్చేందుకు ప్రయత్నించారు. హరిబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్‌గిరి నుంచి దించాలని దామచర్ల టీడీపీ అంతర్గత సమావేశాల్లోనూ చర్చించినట్లు సమాచారం. మొత్తంగా ఈదర తిరిగి పార్టీలో చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దామచర్ల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

తెరపైకి ద్విముఖ వ్యూహం  
పార్టీ కార్యాలయానికి దామచర్ల జెడ్పీ స్థలం అడగడం వెనుక ద్విముఖ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. స్థలం కోరడం వరకే దామచర్ల పాత్ర.  స్థలం ఇచ్చేందుకు దారులు సిద్ధం చేసే బాధ్యత ఈదరదే. ఈ నెల 10న జరిగే సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయాల్సి ఉంది. ప్రతిపక్షాలు మొదలు.. అందరినీ ఇందుకు ఒప్పించాలి. ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాలకు కాకుండా పార్టీ ప్రయోజనాలకు జెడ్పీ స్థలం ఇవ్వడాన్ని అన్ని వర్గాలూ వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు సైతం  ఆగ్రహంతో ఉన్నారు. ఇక జెడ్పీ ఆస్తుల పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానంటూ  చైర్మన్‌ ఈదర పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. సభ్యులతో పాటు ఉద్యోగులు సైతం ఆయనపై ఒకింత నమ్మకంతో ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో జెడ్పీ స్థలం ఇచ్చేందుకు ఈదర అంత  సులభంగా అంగీకరించరు. ఈ విషయం దామచర్లకు కూడా తెలుసు. ఒక వేళ ఆయన జెడ్పీ స్థలం పార్టీ కార్యాలయానికి ఇచ్చేందుకు అంగీకరిస్తే స్థలం తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని దామచర్ల భావిస్తున్నారు. పైగా  ప్రతిపక్షాలతో పాటు సభ్యులు, ఉద్యోగ వర్గాల నుంచి ఈదర వ్యతిరేకత మూటగట్టు కోవాల్సిందే. కాదంటే మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా చైర్మన్‌ పనిచేశారని ఇరికించొచ్చు. విషయాన్ని అధిష్టానం దృష్టికి  తీసుకొచ్చి బదనాం చేయవచ్చు. పార్టీలోకి రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే దామచర్ల జెడ్పీ స్థలం వ్యవహారం తెరపైకి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈదర హరిబాబు వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఈ నెల 10 నాటికి కానీ తెలియదు.

99 ఏళ్ల లీజుకు స్థలం కొట్టేసేందుకేనా?
రూ.50 కోట్ల విలువైన జెడ్పీ స్థలాన్ని పార్టీ కార్యాలయం పేరుతో తొలుత కొట్టేసి ఆ తర్వాత 99 ఏళ్ల లీజు పేరుతో సొంతం చేసుకొనేందుకు కొందరు వ్యూహం పన్నినట్లు అధికార పార్టీకి చెందిన మరోవర్గం పేర్కొనడం గమనార్హం.  

కరణం సూచించిన స్థలానికి నో..
టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం కరణం బలరాం ఎంపీగా ఉన్న సమయంలో ఊరచెరువులో స్థలం ఎంపిక చేశారు. అక్కడే పార్టీ కార్యాలయం నిర్మించాలని అందరూ తీర్మానించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంది. పాత ప్రతిపాదన తెరపైకి తెచ్చి దాన్ని ఓకే చేసుకోవచ్చు. కానీ అక్కడ పార్టీ కార్యాలయం కడితే కరణం బలరాంకు  క్రెడిట్‌ పోతుందన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను దామచర్ల పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.  
 

Advertisement
Advertisement