ఎప్పుడెప్పుడా అని..జనం ఎదురుతెన్నులు | Sakshi
Sakshi News home page

ఎప్పుడెప్పుడా అని..జనం ఎదురుతెన్నులు

Published Sun, Aug 12 2018 1:26 PM

YS Jagan Praja Sankalpa Yatra to enter Vizag on August 14 - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సుమారు నాలుగున్నరేళ్ల క్రితం సమైక్యాంధ్ర విభజన జరిగిన నేపథ్యంలో వేరుపడ్డ నవ్యాంధ్రప్రదేశ్‌లో విశాఖ ఒక్కటే మహానగరం..

రాజధాని సైతం లేని.. ఇప్పటికీ నిర్మాణం కాని.. ఇంకా చెప్పాలంటే తాత్కాలిక రాజధాని కూడా పటిష్టంగా నిర్మించుకోలేని రాష్ట్రంలో అసలు, సిసలు ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా నిలిచింది విశాఖ నగరమే.. అందుకే  పాలకులు దీన్ని నాలుగేళ్లుగా ఉత్సవ విశాఖగా మార్చేశారు. అంతర్జాతీయ సదస్సులకు, పండుగలకు, పబ్బాలకు వేదిక చేసేశారు.

అసలైన ప్రగతి అనేది లేకుండా మేడిపండు చం దంగా విశాఖ నగరాన్ని, జిల్లాను మార్చేసిన పాలకులు.. తెర వెనుక ఈ ప్రాంతాన్ని చెరబట్టేశారు.

దోపిడీ పాలన
► అడ్డగోలు భూదందాలు, భూ ఆక్రమణలతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు విశాఖ నగరంతోపాటు సమీపంలోని భీమిలి, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో భూకంపం సృష్టించారు. ఇక ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం, పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌తో  భయోత్పాతం కల్పించారు. మన్యంలో  ప్రకృతి సంపదను కొల్లగొట్టేశారు.  పార్టీ ఫిరాయింపులు, అనైతిక రాజకీయాలతో అంటకాగిన ఏజెన్సీ ప్రజాప్రతినిధులు మన్యం సంపదను చెరబట్టేస్తున్నారు.

► పెట్టుబడుల సదస్సు పేరిట విశాఖలో వరుసగా మూడేళ్లు వందల కోట్లు ఖర్చు చేశారు. లక్షల కోట్లు వచ్చేస్తాయని, లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఊదరగొట్టారు.. చివరికి వందల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. ఇక విశాఖను ఐటీ హబ్‌ చేసేస్తామని చెబుతూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఇక్కడ ఐటీ రంగం ఉనికినే ప్రశ్నార్ధకం చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ నుంచి రూ.60 వేల కోట్లు, మిగతా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,500 కోట్ల విలువైన ఐటీ ఆధారిత ఎగుమతులు జరిగాయి. కానీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ నుంచి ఎగుమతులు రూ.లక్ష కోట్లకు పెరిగితే.. నవ్యాంధ్రప్రదేశ్‌లో రూ.2 వేల కోట్ల వరకే పెరిగాయంటే ఐడీ ప్ర‘గతి’ అర్ధమవుతుంది.

► ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పక్కాగా అమలు చేయని టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర  ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రైల్వే జోన్‌ సాధనలోనూ  కేంద్రంపై నెపాన్ని నెట్టివేసే రాజకీయాలు చేయడం మినహా నిబద్థతను చూపలేకపోయింది.

► ఇలా ఓ వర్గం.. ఓ రంగం అని కాకుండా.. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ నేతల అంతులేని అవినీతి, పెచ్చుమీరిన అక్రమాలు, నిరంకుశ పాలనలో అన్ని వర్గాలు, రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి.. విశాఖ జిల్లా ప్రగతి, ప్రతిష్ట మసకబారిపోయాయి.  

► మునుపెన్నడూ లేని సమస్యలు, కష్టాలతో కునారిల్లుతున్న విశాఖ జిల్లా ప్రజానీకానికి అండగా నిలిచేందుకు, నేనున్నానని ధైర్యమిచ్చేందుకు, పాలకుల నిరంకుశ ధోరణి, అంతులేని అక్రమాలపై ప్రజాపోరాటాలు చేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో ఈనెల 14న అడుగుపెట్టనున్నారు.

ప్రజా సంకల్పయాత్ర సాగేదిలా.. : తలశిల, గుడివాడ
ఈ నెల 14న జిల్లాలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్టు నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి శరభవరం ఎల్లవరం, దొండపేట, ములగపూడి, బెన్నవరం, నయ్యపురెడ్డిపాలెం, నర్సీపట్నం మీదుగా.. పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో యండపల్లి, సుంకపూరు, కోటవురట్ల, గొట్టివాడ, ములగల్లోవ, దార్లపూడి, ఏటికొప్పాక మీదుగా సాగతుంది. అనంతరం యలమంచిలి నియోజకవర్గంలో ప్రవేశించనున్న పాదయాత్ర పులపర్తి, పురుషోత్తపట్నం, రేగుపాలెం, యలమంచిలి, అచ్యుతాపురం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాలకు చేరుకుంటుంది. తుమ్మపాల మీదుగా బావులపాడు, మామిడిపాలెం, గంధవరం, వెంకన్నపాలెం మీదుగా చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గోవాడ, గణపతినగరం, చోడవరం మీదుగా రేవళ్లు, గౌరవరం, కొత్తవూరు, ఎ.భీమవరం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, సూరెడ్డిపాలెం, సింగరెడ్డిపాలెం మీదుగా మాడుగుల నియోజకవర్గంలోకి పాదయాత్ర సాగుతుంది. ఈ నియోజకవర్గంలో కె.కోటపాడు, జోగన్నపాలెం, రామచంద్రపురం మీదుగా పెందుర్తి నియోజకవర్గంలోని గులిపల్లి, సబ్బవరం మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగతుంది.అక్కడి నుంచి విశాఖ నగర పరిధిలో జరిగే పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ త్వరలో ఖరారు కానుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. 

Advertisement
Advertisement