ఎన్నికల ప్రచారానికి నేడు జగన్‌ శ్రీకారం

YS Jagan Election Campaign From Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగన్‌ ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళతారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. నివాళులర్పిస్తారు.  అనంతరం పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

తరువాత మళ్లీ కడప విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయల్దేరుతారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నర్సీపట్నానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4.30 గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ నెల 16వ తేదీనే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top