వినేవాడు వెర్రివాడయితే చెప్పేవాడు?

Tax officials raid TDP leaders in Andhra Pradesh - Sakshi

రేవంత్‌పై నమోదైన కేసులతో బాబుకు సంబంధం లేదా?

సంబంధం లేకపోతే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు పంపిందెవరు?

మరి ‘బ్రీఫ్డ్‌ మి..’ ఆడియో టేపుల్లో గొంతు ఎవరిది?

ప్రపంచమంతా చూసిన విషయంపైనా పచ్చి అబద్ధాలా?

ఆయన ఎంత తేలిగ్గా అసత్యాలు వల్లిస్తారనేదానికి ఇదే రుజువు

చంద్రబాబు తీరుపై సొంత పార్టీ నేతల్లోనే విస్మయం

బీజేపీయేతర పార్టీల తోడ్పాటు తీసుకోక తప్పదని టీడీపీపీ భేటీలో సీఎం వ్యాఖ్య

ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించాలని చూస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం

సాక్షి, అమరావతి: ‘వినేవారు వెర్రి వెంగళప్పలైతే చెప్పేవారు చంద్రబాబు...!’ అనే తరహాలో ముఖ్యమంత్రి యధావిధిగా గోబెల్స్‌ ప్రచారానికి తెర తీయటంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఓటుకు కోట్లు వ్యవహారంలో వీడియో టేపులతో సహా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసులతో టీడీపీకి సంబంధం ఏమిటని శనివారం నిర్వహించిన టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు పేర్కొనటంపై ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులతో టీడీపీకి ముడి పెట్టాలని కుట్ర పన్నారని, అసలు వీటితో టీడీపీకి, తనకు ఏం సంబంధమని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, మంత్రులంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నట్లు సమాచారం.

టేపుల్లో దొరికిపోయినా..
ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికి జైలుకెళ్లగా దానికి అసలు సూత్రధారి చంద్రబాబు అనే విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కళ్లారా చూసిన విషయం తెలిసిందే. ‘మావాళ్లు బ్రీఫ్డ్‌ మి... ఐ విల్‌ టేక్‌ కేర్‌ యూ... ఐ విల్‌ హానర్‌...’ అంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో బాబు బేరమాడడం గురించి ఆడియో టేపుల్లో స్పష్టంగా ఉన్నా తనకు సంబంధం ఏమిటని ఎంపీల సమావేశంలో చంద్రబాబు ప్రశ్నించడాన్ని చూస్తుంటే నటనలో ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వవచ్చనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఆడియో టేపుల్లోని గొంతు చంద్రబాబుదేనని స్పష్టంగా తేలిపోయిన తరువాత కూడా దాంతో తనకు సంబంధం లేదని బుకాయించడంపై టీడీపీ నేతలే విస్తుపోతున్నారు.

ప్రపంచమంతా చూసినా...
రేవంత్‌రెడ్డిని స్టీఫెన్‌సన్‌ వద్దకు పంపిందెవరు? రేవంత్‌రెడ్డితో స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇప్పించిందెవరు?.. బాబు గారు పంపిస్తేనే వచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పిన వీడియో దృశ్యాలు ప్రపంచమంతా చూశాక కూడా రేవంత్‌తో తనకు సంబంధం ఏమిటని చంద్రబాబు చెప్పడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యవహారాన్ని అందరూ టీవీల్లో తిలకించినా సరే తనకు సంబంధం లేదని చెప్పడాన్ని బట్టి చంద్రబాబు ఎంత తేలిగ్గా అబద్ధాలు ఆడతారో అర్థమైపోతోందని పేర్కొంటున్నారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, ఆ కేసు భయంతో కేసీఆర్‌కు లొంగిపోయి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి అమరావతికి మకాం మార్చి, ఇప్పుడు దాంతో తనకు సంబంధం లేనట్లు నటించడం చంద్రబాబుకు తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో వైఎస్సార్‌ సీపీ రహస్య ఒప్పందం చేసుకుందని, కొన్నిచోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతోందని దుష్ప్రచారం చేస్తుండడంపైనా విస్మయం వ్యక్తమవుతోంది. తనది మోడీది మంచి జోడీ అని, తమ జోడితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు గతంలో పలుసార్లు చెప్పడం గమనార్హం.

కొత్త పొత్తులే శరణ్యం: సీఎం చంద్రబాబు
ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కొత్త పొత్తులు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదని ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల తోడ్పాటు తీసుకోక తప్పదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో బీజేపీ, వైఎస్సార్‌సీపీ మధ్య రహస్య పొత్తు ఉందని ప్రచారం చేయాలన్నారు. రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసిన సర్వేను దొంగ సర్వేగా చిత్రీకరించాలన్నారు.

తెలంగాణలో కలిసి పనిచేద్దామని కేసీఆర్‌ను కోరినా పట్టించుకోలేదని, టీడీపీ పోటీ చేయాలనుకుంటే ఒంటరిగా పోటీ చేయాలని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవద్దని ఆయన సూచించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ దాడులు రాజకీయ కోణంలో జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు తరహాలోనే ఇక్కడా చేస్తున్నారని, భయోత్పాతం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) ఎదుట నిరసన తెలుపుతామని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. సమావేశంలో ఎంపీలు సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top