'హోదా కన్నతల్లి... ప్యాకేజీ సవతి తల్లి'

'హోదా కన్నతల్లి... ప్యాకేజీ సవతి తల్లి' - Sakshi


అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నతల్లి, ప్యాకేజీ సవతి తల్లి వంటిదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. అనంతలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోదా వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్యాకేజీ వస్తే చంద్రబాబుకు మేలు జరుగుతుందన్నారు.



ఇప్పటికైనా మించిపోయింది లేదంటూ సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కాళ్లు పట్టుకుని అయినా హోదాను సాధించాలని రఘువీరా డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరచిన అధికార పార్టీ నాయకులు కేవలం ప్రచారాలు, ఆర్భాటాలు, సమావేశాలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. బాబూ, మోదీ ఇద్దరూ కలసికట్టుగా హామీలను విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేయడం మరచి ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో కూడా రుణాలను మాఫీ చేస్తామని మోదీ చెబుతుండటం సిగ్గుచేటన్నారు.



2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎల్పీ లీడర్‌గా ఉన్నపుడు చెప్పకుండానే ఉచిత విద్యుత్‌ అందించామని, ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా రుణాలను మాఫీ చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నేతలు సుమారు 600 హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. మరో ముప్ఫై ఏళ్లపాటు రాష్ట్రంలో టీడీపీ పాలన ఉంటుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ హామీలను నెరవేర్చడానికి మరో ముప్ఫై ఏళ్లు కావాలని బాబు అడుగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఇన్‌చార్జ్‌ కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, జిల్లా నేతలు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top