కోవిడ్‌ –19 ఎఫెక్ట్‌ రూ.3 మాస్క్‌ రూ.30 | Sakshi
Sakshi News home page

మాస్క్‌.. ఫుల్‌ డిమాండ్‌

Published Fri, Mar 13 2020 12:48 PM

Masks Prices Hikes in SPSR Nellore COVID 19 Effects - Sakshi

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో 2,000 వరకు మందుల దుకాణాలున్నాయి. వీటిల్లో సాధారణ మాస్క్‌లు విక్రయించడం పరిపాటి. అయితే కోవిడ్‌ – 19 వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్క్‌లు వాడాలని వైద్యశాఖాధికారులు ప్రకటించారు. దీనిని సాకుగా చూపి మందుల దుకాణాల వారు మాస్క్‌లున్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. 100 సాధారణ మాస్క్‌ల కట్ట రూ.300 మార్కెట్‌లో దొరికేది. అంటే ఒక్కొక్క మాస్క్‌ కేవలం రూ.3 మాత్రమే. అలాంటిది ప్రస్తుతం బ్లాక్‌మార్కెట్‌ సృష్టించి రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. అలాగే ఈఎస్‌ఐ అనే పేరుతో మంచి మాస్క్‌లున్నాయని చెబుతూ వాటిని సైతం రూ.200 నుంచి రూ 250కి అమ్ముతున్నారు. కోవిడ్‌ భూతాన్ని చూపి మందుల షాపుల యజమానులు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. 

దాడులేవి..
మాస్క్‌ల కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా అధిక ధరకు విక్రయిస్తున్నా జిల్లా ఔషధ నియంత్ర శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే ఒకటి, రెండు దుకాణాలు తనిఖీ అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత తనిఖీల సంగతి వదిలేశారు.

నిబంధనలు పాటించకపోతే కేసులు
మాస్క్‌లను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్నిచోట్ల దాడులు చేసి హెచ్చరించాం. ఎన్‌–95 మాస్క్‌ కొంచెం ధర అధికంగా ఉంటుంది. వాస్తవ ధర కన్నా ఎక్కువకు విక్రయిస్తే అలాంటి షాప్‌లను మూసేయిస్తాం. కేసులు నమోదు చేస్తాం.– మహేష్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, నెల్లూరు

ఇలా చెబుతూ..
పొదలకూరురోడ్డులోని బ్యాంక్‌ కాలనీకి చెందిన మూలె కౌశిక్‌ చెన్నైలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి రైల్లో  చెన్నై బయలుదేరాడు. కోవిడ్‌ – 19 వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అతను బోసుబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్‌ తదితర మెడికల్‌ షాపుల్లో మాస్క్‌లు కొనేందుకు ప్రయత్నించాడు. కొన్నిచోట్ల నో స్టాక్‌ అని చెప్పడమే కాకుండా వైరస్‌ రాకుండా ఉండాలంటే ఎన్‌–95 మాస్క్‌ వాడాలని, సాధారణ మాస్క్‌ వల్ల ఉపయోగం లేదని చెప్పారు. మాస్క్‌లున్నా స్టాక్‌ లేనట్టు చెబుతూ ఖరీదైన మాస్క్‌లు విక్రయించారు. రూ.100 విలువైన ఎన్‌–95 మాస్క్‌ను రూ.250 ఖర్చు చేసి అధికరేటుకు కొన్నాడు. ఇది కేవలం రెండు, మూడురోజులు మాత్రమే పనిచేస్తుంది. మళ్లీ కొత్తది కొనాల్సిందే. అనేకమందికి ఎదురవుతున్న సమస్య ఇది.

కారాగారంలో మాస్క్‌ల తయారీ
నెల్లూరు(క్రైమ్‌): కోవిడ్‌ – 19 వైరస్‌ వ్యాప్తి చెందుతున్న జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ రవికిరణ్‌ కారాగారంలోనే ఎలాస్టిక్‌ బ్యాండ్, త్రెడ్‌మోడ్‌ (రెండు రకాల) మాస్క్‌లను తయారు చేయించారు. కారాగారంలో తయారైన మాస్క్‌లను అక్కడి సిబ్బందికి, ఖైదీలకు పంపిణీ చేశారు. వీటిని జిల్లా ప్రజలకు సైతం అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంచేలా తీసుకుంటామని రవికిరణ్‌ తెలిపారు.

Advertisement
Advertisement