డోన్ తాగునీటి సమస్యపై చలో గాజులదిన్నెq | Sakshi
Sakshi News home page

డోన్ తాగునీటి సమస్యపై చలో గాజులదిన్నె

Published Sun, Sep 14 2014 12:01 AM

డోన్ తాగునీటి సమస్యపై చలో గాజులదిన్నెq - Sakshi

 డోన్‌టౌన్/గోనెగండ్ల: డోన్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం చలో గాజులదిన్నె ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 వాహనాలలో ప్రజలు భారీగా తరలివచ్చారు. గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని డోన్‌కు పంపింగ్ చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.51 కోట్లు మంజూరు చేశారు. అయితే ఆ నిధులతో చేపట్టిన పైప్‌లైన్, ఇంటెక్ వెల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీటి సరఫరా ప్రారంభం కాకపోవడంతో డోన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చలో గాజులదిన్నె కార్యక్రమాన్ని చేపట్టారు. కొనసాగుతున్న పనులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని తాగునీటి కోసం డోన్ పట్టణానికి రూ.51 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. అయితే రాజకీయ, తదితర కారణాలతో ఆ పనులు నేటికి పూర్తికాకపోవడంతో డోన్ పట్టణ ప్రజలకు మూడు, ఐదు రోజులకొకసారి తాగు నీటి సరఫరా జరుగుతుందన్నారు. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనులు పూర్తి అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. వచ్చే ఆరు నెలల్లో నీటి పథకానికి సంబంధించిన పనులు పూర్తిచేసి తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ  ఈఈ సత్యనారాయణ, డోన్ జెడ్‌పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి, ఆర్‌ఈ రాజవర్దన్, పట్టణ కన్వీనర్ పాలుట్ల రఘురామ్, బీసీసెల్ నాయకుడు కోట్రాయి సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
 

 

Advertisement
Advertisement