చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారట! | Babu are working 36 hours a day | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రోజుకు 36 గంటలు పని చేస్తున్నారట!

Feb 1 2017 4:24 PM | Updated on Aug 29 2018 7:39 PM

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పదవీ గండం భయం పట్టుకుందని జనం చర్చించుకుంటున్నారు.

శ్రుతి మించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వామి భక్తి

హిందూపురం రూరల్‌: రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పదవీ గండం భయం పట్టుకున్నట్లుంది. తన అమాత్య పదవి పోకుండా ఉండేందుకు అయిన దానికి, కాని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతుండటం చూసి విస్తుపోతున్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు  రోజుకు 36 గంటలు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి నాయకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘనత నారా వారిది’ అంటూ ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో విలేకరులతో అన్నారు.

అదేంటి సార్‌.. అలా అంటున్నారంటే, ''అంతేనయ్యా.. మా ముఖ్యమంత్రి నిద్రపోకుండా పని చేస్తున్నారని చెబుతున్నాను'' అని కూడా అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ‘పల్లె’కు బెర్త్‌ దొరకదనే ప్రచారం ఊపందుకోవడంతో ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చిందని ‘అనంత’వాసులు చర్చించుకుంటున్నారు. 

పంచ్ పడింది...
దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్ మీడియాలో పంచ్‌లు వెల్లువెత్తుతున్నాయి. పల్లె చెప్పిన మాటను ప్రస్తావిస్తూ.. 'నువ్వు కూడా బీకాంలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివావా రాజా' అన్న పంచ్ ఒకటి సోషల్ మీడియా సైట్లలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఇంతకుముందు జలీల్ ఖాన్ ఇలాగే బీకాం ఫిజిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వాట్సప్, ఫేస్‌బుక్‌లలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. రోజుకు ఉండేవే 24 గంటలైతే, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు 36 గంటలు ఎలా పనిచేస్తున్నారో అర్థం కాక సామాన్యులు జుట్టు పీక్కుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement