వ్యక్తి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

వ్యక్తి అరెస్ట్‌

Published Thu, Apr 18 2024 10:45 AM

ప్రమాదంలో మృతి చెందిన స్కూటరిస్టు   - Sakshi

రామసముద్రం : అక్రమంగా కర్నాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని బుధవారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు .. రామసముద్రం మండలం కుదురుచీమనపల్లె పంచాయతీ జోగిండ్లుకు చెందిన పిండ్రాళ్ల వెంకటరమణ కర్నాటక రాష్ట్రం నుండి అక్రమంగా (ఒరిజనల్‌ ఛాయిస్‌ విస్కీ)192 టెట్రాప్యాకెట్స్‌ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈదాడుల్లో సిబ్బంది గంగిరెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

పీలేరు రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం మద్దిపట్లవారిపల్లెకు చెందిన యల్లయ్య (30) బుధవారం రాత్రి ద్విచక్రవాహనంలో పీలేరునుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద కడప వైపు నుంచి చైన్నె వెళుతున్న టెంపో వాహనం ఎదురుగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరసింహుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

మదనపల్లె : కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యంను మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ వలీబాషు తెలిపారు. పెట్రోలింగ్‌లో భాగంగా రాత్రి గస్తీ తిరుగుతుండగా, పట్టణంలోని నెమలినగర్‌ వద్ద రాయచోటికి చెందిన యస్‌.గౌస్‌మొహియుద్ధీన్‌, ఎస్‌.మగ్బూల్‌లు, ఏపీ–04యూ.3617 లారీలో రేషన్‌బియ్యం రాయచోటి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. లారీలో 583 బ్యాగుల్లోని 19,160 కిలోల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు.

కేసు నమోదు

మదనపల్లె : వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ ఎన్‌.శేఖర్‌ తెలిపారు. మండలంలోని చిప్పిలికి చెందిన శివయ్య భార్య వసంత(28) ఈనెల 13 నుంచి ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయిందన్నారు. కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో బుధవారం తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆమెకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ముగ్గురు పిల్లలున్నట్లు సీఐ చెప్పారు. భర్త శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement