నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Published Wed, Nov 29 2023 1:52 AM

- - Sakshi

వల్లూరు: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు, రైతులకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేరొన్నారు. తాడేపల్లెలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌ ద్వారా రాష్ట్రంలోని పలు జిల్లాలతో బాటు వల్లూరు మండలంలోని అంబవరం వద్ద 132/33 కేవీ విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవాన్ని, వైలవరం వద్ద 1000 మెగావాట్ల సామర్థ్యంలో 750 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వల్లూరు మండలంలోని అంబవరం సమీపంలోని నూతన శాటిలైట్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలా ఫలకాల ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, కమలాపురం ఎమ్మెల్యే పీ రవీంద్రనాథరెడ్డి, ఏపీఎస్‌ ఆర్‌టీసీ రాష్ట్ర చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు వల్లూరు మండల ప్రాంతంలో 132 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ లేదన్నారు. ఈ ప్రాంత పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా 132 /33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ శాటిలైట్‌ ఉప కేంద్రం ఏర్పాటు వల్ల కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వల్లూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి మండలాలకు చెందిన 30 వేల మంది అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని అన్నారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందని, విద్యుత్‌ ప్రసారంలో అంతరాయాలను అరికట్టడంతో పాటు పారిశ్రామిక, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి వీలవుతంందని అన్నారు. జిల్లా కలెక్టర్‌ విజయ రామరాజు మాట్లాడుతూ ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధంతో జిల్లాలోని మైలవరం మండలంలో 1000 మెగావాట్ల సోలార్‌ పార్కు అభివృద్ధి కోసం భారత పునరుత్పాదక మంత్రిత్వశాఖ 2015లో ఆమోదం తెలిపిందని అన్నారు. దీనికి ఏపీఎస్పీడీసీఎల్‌ అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూరుస్తోందని అన్నారు. ఇందులో భాగంగా 2020లో 250 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించినట్లు చెప్పారు. రూ 3 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న మిగిలిన 750 మెగావాట్ల ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

● కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మెన్‌ బద్వేలు షేక్‌ గౌస్‌ లాజమ్‌, రాష్ట్ర ఉద్యాన వన సలహాదారు పీ శివ ప్రసాద్‌ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ కమీషన్‌ సభ్యులు హిదయతుల్లా, జీసీ గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరధ్వాజ్‌, అంబవరం, దిగువపల్లె సర్పంచ్‌లు ఓబుల్‌ రెడ్డి, కుళాయప్ప, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ (ప్రాజెక్ట్‌) రాజేంద్ర ప్రసాద్‌, ఎస్‌ఈ (టెలికాం )మోహన్‌రావు, ఎపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమణ, డీఈ జీవీ సత్యనారాయణ, విజయ్‌కుమార్‌ రెడ్డ్చి డిఈఈ సురేఖ రెడ్డిచ కడప సోలార్‌ ప్రాజెక్టు ఇంజనీర్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

Advertisement
Advertisement