మన తలరాతలు మారాలంటే జగన్‌ రావాలి | Sakshi
Sakshi News home page

మన తలరాతలు మారాలంటే జగన్‌ రావాలి

Published Fri, Nov 24 2023 1:40 AM

- - Sakshi

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌

కడప కార్పొరేషన్‌ : మన తల రాతలు మారాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం కడపలోని యూఎస్‌ మహల్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ జకియాఖానమ్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ కుంభా రవిబాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయంటూనే అన్ని పార్టీలకు సామాజిక న్యాయం, సాధికారత గుర్తుకు వస్తాయన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయంగా, సామాజికంగా ఏం లబ్ది చేకూర్చారో చెప్పాలని నిలదీశారు. దీనిపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయాలని అడిగే దమ్మున్న నేత ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల మన విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం లభించిందన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ జకియాఖానమ్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను జగనన్న ప్రభుత్వం అమలు చేసిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకొచ్చారన్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కావడానికి 76 సంవత్సరాలు పట్టిందని, కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరుపైనే ఇస్తూ ఆర్థిక సాధికారత దిశగా పయనింపజేస్తున్నారన్నారు.

● ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, మార్కెట్‌యార్డు చైర్‌ పర్సన్‌ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వాలు పేదల శ్రమను దోపిడీ చేశాయి

గతంలో పాలించిన అన్ని ప్రభుత్వాలు పేదలు, బడుగు, బలహీన వర్గాల శ్రమశక్తిని దోపిడీ చేశాయని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ప్రథమ శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దేందుకు వారిని సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి తెస్తున్నారన్నారు. తన మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది జెడ్పీ చైర్మన్లలో 12 మంది, మేయర్లలో 9 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. అమరావతిలో 51 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారన్నారు.

Advertisement
Advertisement