అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Published Fri, Dec 15 2023 1:00 AM

ఫోన్‌లో ప్రజల సమస్యలు వింటున్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య - Sakshi

యాదగిరిగుట్ట : ‘అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయిస్తాం.. అనిన గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లేలా చర్యలు తీసుకుంటా.. సర్కారు వైద్యానికి ప్రాధాన్యం ఇస్తా.. మోటకొండూర్‌ మండలంలోని చాడ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తా.. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని’ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు నియోజకవర్గ సమస్యలపై గురువారం సాక్షి నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ప్రశ్న : నా భర్త చనిపోయాడు. పింఛన్‌ వస్తలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఇల్లుకూడా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

–తోల్పునూరి కవిత, దాతారుపల్లి

ఎమ్మెల్యే : మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తా. పింఛన్‌ కోసం అధికారులను ఆదేశిస్తా.

ప్రశ్న : ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలుగా మార్చాలి. మెడికల్‌ కళాశాల ఆలేరులోనే ఏర్పాటు చేయాలి. –బందెల సుభాష్‌, ఆలేరు

ఎమ్మెల్యే : ఆలేరు సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాను. ఆస్పత్రి సామర్థ్యాన్ని 100 పడకలకు పెంచేలా ప్రభుత్వంతో మాట్లాడుతా. మెడికల్‌ కళాశాల అంశాన్ని ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్తా.

ప్రశ్న : కాచారం గ్రామానికి 2019 నుంచి బస్సులు రావడం లేదు. –అరుణ్‌రెడ్డి, కాచారం

ఎమ్మెల్యే : ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గ్రామానికి బస్సులు వచ్చేలా చూస్తా.

ప్రశ్న : ఆలేరులో రైల్వేఅండర్‌ పాస్‌ను త్వరగా పూర్తి చేయాలి. –ఎగ్గిడి శ్రీశైలం, ఆలేరు

ఎమ్మెల్యే : విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం.

ప్రశ్న : మా గ్రామంలో రేషన్‌ షాప్‌ లేదు.

–రమేష్‌నాయక్‌, మైలారంకిందితండా

ఎమ్మెల్యే : మైలారంకిందితండాకు ప్రత్యేక రేషన్‌ దుకాణం ఏర్పాటు చేసి డీలర్‌ను నియమిస్తాం.

ప్రశ్న : చాడ, ముత్తిరెడ్డిగూడెంను మండలంగా ఏర్పాటు చేయాలి. మోటకొండూర్‌ మండలం భౌగోళికంగా లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

–సాయికుమార్‌, ముత్తిరెడ్డిగూడెం

ఎమ్మెల్యే : చాడ, ముత్తిరెడ్డిగూడెం మండల ఏర్పాటుకు సహకరిస్తా. ప్రభుత్వంతో చర్చించిన తరువాత మండలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా.

ప్రశ్న : ఆలేరు గ్రామపంచాయతీ ఉన్నప్పుడు వాటర్‌ ఫిల్టర్లు ఉండేవి. మున్సిపాలిటీ అయ్యాక లేవు. ప్రైవేట్‌ ఫిల్టర్లలో కెమికల్‌ నీళ్లు వస్తున్నాయి.

–మహేష్‌, ఆలేరు

ఎమ్మెల్యే : మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాటర్‌ ఫిల్టర్లు నడిపించేలా చర్యలు తీసుకుంటా.

ప్రశ్న: యాదగిరిగుట్టలోని బీసీ కాలనీలో సీసీ రోడ్డు వేస్తామని ఉన్న రోడ్డును తొలగించారు.

–గ్యాదపాక కనకరాజు, బీసీ కాలనీ యాదగిరిగుట్ట

ఎమ్మెల్యే : మూడు రోజుల్లో యాదగిరిగుట్టలో పర్యటిస్తాను. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో మాట్లాడి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాను.

ప్రశ్న : సాయిగూడెం 2వ వార్డులో డ్రెయినేజీలు సరిగ్గా లేదు. చేసిన పనులు కూడా మొక్కుబడిగా ఉన్నాయి. –నర్సింగరావు, సాయిగూడెం

ఎమ్మెల్యే : సాయిగూడెంలో డ్రెయినేజీ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. పంచాయతీ అధికారులు, సర్పంచ్‌తో మాట్లాడుతాను.

ప్రశ్న : నేను దివ్యాంగురాలిని. ఎలాంటి ఆధారం లేదు. నా భర్త కూడా అనారోగ్యంతో ఉన్నాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి

–కుమ్మరిండ్ల భవాణి, కొలనుపాక

ఎమ్మెల్యే : రెండు, మూడు రోజుల్లో ఆలేరుకు వస్తా. కచ్చితంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాను.

ప్రశ్న : యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను విస్తరించారు. అందులో మా ప్లాట్‌ కోల్పోవాల్సి వచ్చింది. ప్రొసీడింగ్‌ పత్రాలు ఇచ్చినప్పటికీ ప్లాట్‌ నంబర్‌ ఇవ్వలేదు.

–రాజేష్‌, ఆలేరు

ఎమ్మెల్యే : ఆర్డీఓ, తహసీల్ధార్‌తో మాట్లాడుతాను. భూ నిర్వాసితులను ఆదుకుంటా.

ప్రశ్న : రాజాపేట, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందజేయాలి. –రాములు, కుర్రారం

ఎమ్మెల్యే : గంధమల్ల రిజర్వాయర్‌ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతా. అసెంబ్లీలో సైతం చర్చించి సాగు నీరు అందించడానికి చర్యలు తీసుకుంటాను.

ప్రశ్న : నాకు కాళ్లు, చేతులు పని చేయవు. నేను ఇంటి దగ్గరానే కంప్యూటర్‌ వర్క్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి.

–చిన్నం మణికంఠ, కొరటికల్‌

ఎమ్మెల్యే : బీర్ల ఫౌండేషన్‌ ద్వారా రూ.10వేలు సాయం చేస్తున్న. ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసి ఇంటి వద్దనే ఉద్యోగం చేసుకోవచ్చు.

ప్రశ్న : మా అమ్మ బీడీలు చూడుతుంది. పింఛన్‌ రావడం లేదు.

–చింతకింది వినయ్‌, మార్కండేయనగర్‌, ఆలేరు

ఎమ్మెల్యే : బీడీ కార్మికుల పింఛన్‌ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా.

ప్రశ్న : గుండాల మండలం అభివృద్ధిలో వెనుకబడింది. –రాములు, గుండాల

ఎమ్మెల్యే : గుండాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. ఇటీవలనే అధికారులతో సమీక్ష నిర్వహించా. ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తాను.

ప్రశ్న : శివలాల్‌తండాకు వెళ్లేమార్గంలో రైల్వే గేట్‌ ఉంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలి.

–వెంకట్‌నాయక్‌, శివలాల్‌తండా

ఎమ్మెల్యే : సమస్య దృష్టిలో ఉంది. తవరలో పరిష్కరిస్తాం.

ప్రశ్న : కూరెళ్ల నుంచి రాఘవపురం వెళ్లే బ్రిడ్జి కూలిపోతుంది. ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. –శంకర్‌, కూరెళ్ల

ఎమ్మెల్యే : మంత్రి వెంకట్‌రెడ్డితో మాట్లాడి బ్రిడ్జికి నిధులు తీసుకువచ్చి బాగు చేయిస్తాను.

ప్రశ్న : రాజాపేటలో ఒకేషనల్‌ కళాశాల ఏర్పాటు చేయాలి. –అశోక్‌, రాజాపేట

ఎమ్మెల్యే : ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా ఒకేషనల్‌ కళాశాల తీసుకువస్తాను.

ప్రశ్న : ముద్ర రుణాలు ఇవ్వడం లేదు. ఏడాది నుంచి బ్యాంక్‌ అధికారులు చుట్టూ తిరుగుతున్నా.

–చెరుపల్లి లావణ్య, గౌరాయపల్లి

ఎమ్మెల్యే : బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడి సమస్యను తెలుసుకుంటా. రుణం అందే విధంగా కృషి చేస్తా.

ప్రశ్న : బునాదిగాని కాల్వలో మా భూమి పోయింది. నష్టపరిహారం రాలేదు.

–మల్లారెడ్డి, గుండాల

ఎమ్మెల్యే : ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతా. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటా.

ప్రశ్న : తుర్కపల్లిలో పీహెచ్‌సీ రోడ్డుకు దూరంగా ఉంది. వైద్యాధికారులతో మాట్లాడి పీహెచ్‌సీని రోడ్డుకు సమీపంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి.

–ఎరుకల వెంకటేష్‌, దత్తాయిపల్లి

ఎమ్మెల్యే : పీహెచ్‌సీని రోడ్డుకు ఇరువైపులా ఏదో ఒక చోట ఉండేలా చర్యలు తీసుకుంటాను.

ఫ ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తా

ఫ వైద్యానికి ప్రాధాన్యం

ఫ చాడ మండలం ఏర్పాటుకు కృషి

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement