గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ కరణ్‌ సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ కరణ్‌ సస్పెన్షన్‌

Published Sat, May 25 2024 1:25 PM

-

పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ ఉత్తర్వులు

విద్యారణ్యపురి: భీమదేవరపల్లి మండలం వంగరలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ హెచ్‌ఎం ఎల్‌.కరణ్‌ను ఈనెల 23న సస్పెన్షన్‌ చేస్తూ.. వరంగల్‌ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరణ్‌ ఫోర్జరీ చేసి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్రయోజనాలు పొందారని ఆరోపిస్తూ డీటీఎఫ్‌ రాష్ట్ర శాఖ బాధ్యులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు.. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ చేసినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు.

ఫేక్‌ డాక్యుమెంట్ల తయారీ..

హెడ్మాస్టర్‌ కరణ్‌ తనకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ స్కేల్‌ 18 ఏళ్ల సర్వీస్‌ ఇంక్రిమెంట్‌ పొందేందుకు ఎలిజిబిలిటీ లేకున్నప్పటికీ హనుమకొండ డీఈఓ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్లుగా ఫోర్జరీ చేసి తనకు తానే స్వయంగా ప్రొసీడింగ్స్‌ పత్రాలు సృష్టించుకుని ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ 18 ఏళ్ల సర్వీస్‌కు సంబంధించిన ఇంక్రిమెంట్‌ ప్రయోజనం పొందారనేది ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఆర్జేడీ తెలిపారు. హెచ్‌ఎం కరణ్‌పై వచ్చిన ఆరోపణల ఫిర్యాదును హనుమకొండ డీఈఓ అబ్దుల్‌హైకి పంపగా.. తాను ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ కింద 18 ఏళ్లకు సంబంధించిన ఇంక్రిమెంట్‌ ప్రొసీడింగ్స్‌ను డీఈఓ కార్యాలయం నుంచి ఇవ్వలేదని ఫోర్జరీ చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించార డీఈఓ ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అనంతరం కొద్దిరోజుల క్రితం కరణ్‌కు షాకాజ్‌ నోటీస్‌ జారీ చేశామని అతడు ఇచ్చిన వివరణను కూడా డీఈఓకు పంపామని ఆర్జేడీ తెలిపారు. అతడి వివరణ సరికాదని, తప్పడు పత్రాలు సృష్టించి డీఈఓ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్లుగా ఫోర్జరీ చేశారని వెల్లడవడం, కరణ్‌ తన సర్వీస్‌ బుక్‌ను ఇష్టానుసారంగా మార్పులు చేసుకున్నారని వెల్లడైనందున కరణ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి వివరించారు.

సమగ్ర విచారణ జరిపించాలి: డీటీఎఫ్‌

కరణ్‌ చేసిన తప్పిదాలపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి భారతి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కరణ్‌ గతంలో పని చేసిన పాఠశాలల్లోనూ ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement