పాలిటిక్స్‌ షురూ.. | Sakshi
Sakshi News home page

పాలిటిక్స్‌ షురూ..

Published Fri, Apr 19 2024 1:25 AM

- - Sakshi

సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మురళీనాయక్‌, అభ్యర్థి బలరాంనాయక్‌ తదితరులు

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గురువారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారానికి ఫంక్షన్‌హాళ్లను వేదికగా చేసుకుంటున్నారు. ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. శుక్రవారం మానుకోటలో సీఎం ప్రచారసభలో పాల్గొననున్నారు. అదేవిధంగా ఈ నెల 24న హనుమకొండలో బహిరంగసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా వ్యూహాలు..

వరంగల్‌ పార్లమెంట్‌ ఎస్సీ రిజర్వుడు, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎస్టీ రిజర్వుడు స్థానాలను కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈరెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రచారం చేసేలా ఆపార్టీ షెడ్యూల్‌ రూపొందించుకుంటోంది. అదే సమయంలో బీజేపీ కూడా జాతీయ అగ్రనేతలతో ప్రచారం ఉండేలా కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పార్టీల ముఖ్యనేతల ప్రసంగాలకు ఉమ్మడి వరంగల్‌ వేదిక కానుంది.

రెండు రోజుల్లో నామినేషన్లు..

తొలిరోజు నామినేషన్ల దాఖలుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆసక్తిచూపలేదు. రిజిస్టర్డ్‌, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంచి ముహూర్తం కోసం ఆరా తీస్తున్నారు. 20వ తేదీలోపే మంచి రోజులు ఉండడంతో కొందరు శుక్రవారం, మరికొందరు శనివారంలోపు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో ఆయా పార్టీల నాయకులు గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను కూడా నియమించాయి. ఈ నెల 24న మడికొండలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు గురువారం పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.

వీరి జాతకం తేల్చేది ఎంతమందంటే..

వరంగల్‌ లోక్‌సభ పరిధిలో వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 18,16,543 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,91,940 మంది పురుష ఓటర్లు, 9,24,208 మంది మహిళా ఓటర్లున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేట, ములుగుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. కొత్త ఓటరు జాబితా ప్రకారం 15,30,367 మంది ఓటర్లున్నారు. వీరిలో 7,46,982 మంది పురుష ఓటర్లు, 7,83,280 మంది మహిళా ఓటర్లున్నారు. వీరంతా నాయకుల జాతకం తేల్చనున్నారు.

ఓవైపు నామినేషన్లు.. మరోవైపు ప్రచారం

ఉమ్మడి జిల్లాలో మొదలైన

రాజకీయ వేడి

వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీ

స్థానాల్లో గెలుపుపై దృష్టి

24న హనుమకొండలో

కాంగ్రెస్‌ సభ నిర్వహణకు కసరత్తు

అదేబాటలో బీఆర్‌ఎస్‌,

బీజేపీ అగ్రనేతలు

నామినేషన్ల దాఖలుకు మంచి

ముహూర్తంపై అభ్యర్థుల ఆరా

నేడు మానుకోటకు సీఎం

ఎన్నికల ప్రచార సభకు

హాజరుకానున్న రేవంత్‌

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మనుకోటకు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. కాగా మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ ఉదయం నామినేషన్‌ వేస్తారు. సాయంత్రం 4గంటలకు మహబూబాబాద్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం హాజరై ప్రసంగిస్తారు. 6గంటలకు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారు. కాగా మూడు రోజులుగా సభ ఏర్పాట్లను సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పరిశీలించారు. గురువారం మంత్రి తుమ్మల జిల్లా పోలీస్‌ అధికారులతో కలిసి సభా వేదిక, హెలిపాడ్‌ను పరిశీలించారు. దంచికొండుతున్న ఎండల నేపథ్యంలో బహిరంగ సభకు జనసమీకరణ స్థానిక నాయకులకు సవాల్‌గా మారింది. గతంలో మాదిరిగా ప్రజలు స్వచ్ఛందంగా సభలకు వచ్చే పరిస్థితి లేదని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తేనే వస్తారని పలువురు నాయకులు చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ శుక్రవారం ఉదయమే నామినేషన్‌ వేయనున్నారు.

Advertisement
Advertisement