Sakshi News home page

అంబేడ్కర్‌ అందరికీ ఆదర్శం

Published Mon, Apr 15 2024 1:35 AM

- - Sakshi

కాశిబుగ్గ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. వరంగల్‌ కాశిబుగ్గ జంక్షన్‌లో ఆదివారం జరిగిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రావీణ్య, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. దేశ భవిష్యత్‌ అవసరాలను ముందే ఉహించి ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనీకుడని కొనియాడారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆశయాలను నెరవేర్చాలి

కాళోజీ సెంటర్‌: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చాలని పీఆర్టీయూ టీజీ జిల్లా అధ్యక్షురాలు కొలిపాక సంగీత అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పందన మానసిక దివ్యాంగులు, బధిరు ల కేంద్రంలో పిల్లలకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ అంబేడ్కర్‌ అందరికోసం ఆలోచించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీ యూ టీజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ రెడ్డి, కోశాధికారి సర్వేశ్వర్‌, ఉపాధ్యాయులు నాగబండి రమేశ్‌, మన్నే చంద్రయ్య, వెంకటేశ్‌, రఘురెడ్డి, సీడబ్ల్యూసీ మాజీ చైర్‌పర్సన్‌ అనితా రెడ్డి పాల్గొన్నారు.

బెల్ట్‌ షాపులపై దాడులు

చెన్నారావుపేట: బెల్ట్‌ షాపులపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై గూడ అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్న బూర రమేశ్‌, పర్శ నర్సయ్య, వనపర్తి చేరాలు, వేముల సదానందం వద్ద రూ.30 వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సంగెం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మొండ్రాయి గ్రామానికి చెందిన పాక రవి (46)కి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఈశ్వర్‌, వాసుదేవ్‌ ఉన్నారు. కులవృత్తి చేపలు పట్టడంతోపాటు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రవి ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చిన అనంతరం ఉదయం 11–30 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. గ్రామంలోని రైతు వేదిక సమీపంలో మొక్కజొన్న చేను ఒడ్డు వద్ద కిందపడి చనిపోయి ఆయన కనిపించాడు. సమాచారం తెలుసుకుని కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి తల వెనక గాయమై కిందపడి పోయి ఉన్నాడు. ఎండకు రమేశ్‌ శరీరం కమిలిపోయి ఉంది. చీమలు సైతం కొరికాయి. మృతుడి పెద్ద కుమారుడు ఈశ్వర్‌ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్‌.నరేష్‌ తెలిపారు.

నేటి గ్రేటర్‌ గ్రీవెన్స్‌ రద్దు

వరంగల్‌ అర్బన్‌ : బల్దియా కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, నగర ప్రజలు గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు బల్దియా ప్రధాన కార్యాలయానికి రావొద్దని కోరారు.

Advertisement
Advertisement