బీజేపీ.. ప్రజల పార్టీ | Sakshi
Sakshi News home page

బీజేపీ.. ప్రజల పార్టీ

Published Tue, Nov 21 2023 1:46 AM

- - Sakshi

జనగామలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న అమిత్‌షా

జనగామ: ‘బీజేపీ ప్రజల పార్టీ.. కొమురవెల్లి మల్లన్న, సిద్దులగుట్ట సిద్దేశ్వరుడి ఆశీస్సులతో బీజేపీ బరిలో నిలిచింది. పార్టీ, అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించే బాధ్యత మీదే’ అంటూ బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రం ప్రెస్టన్‌ మైదానంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థులు ఆరుట్ల దశమంతరెడ్డి, విజయరామారావు, రాంమోహన్‌రెడ్డి గెలుపు కోసం తలపెట్టిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో సమానంగా కదన రంగంలో దూసుకుపోతున్న బీజేపీ శ్రేణుల్లో అమిత్‌ షా టూర్‌ మరింత జోష్‌ పెంచింది. భారత్‌ మాతాకీ జై.. వందేమాతరం అంటూ కేడర్‌తో పాటు సభకు వచ్చిన జనంతో పలికిస్తూ.. వారిలో దేశ భక్తిని నింపారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట హెలిపాడ్‌ వద్ద దిగిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో సభా వేదికకు చేరుకున్న అమిత్‌ షా.. ప్రజలకు అభివాదం చేశారు. అయోధ్యలో రామమందిరం కావాలా వద్దా? అంటూ.. వచ్చే ఏడాది జనవరిలో రామ మందిరం విగ్రహాలను పీఎం మోదీజీ ప్రతిష్ఠించబోతున్నారు.. అయోధ్యలోని జైశ్రీ రామ్‌ యాత్రకు ఉచితంగా ప్రయాణించేలా అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ.. జనగామ జిల్లాకు పాలిటెక్నిక్‌ కళాశాల ఇస్తామని చెప్పి, హామీని విస్మరించిందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రస్తుతం బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ భూకబ్జాదారులని ఘాటుగా విమర్శించారు. అలాంటి వారికి ఓటెయ్యకుండా, దేశాభివృద్ది కోసం పాటుపడే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రజల పార్టీ అని, ఇక్కడ బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ధైర్యంగా ప్రకటించామన్నారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అమిత్‌షా ప్రసంగాన్ని ప్రజలకు తెలుగులో అనువాదం చేసి వినిపించారు. 19 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.

తరలివచ్చిన మహిళలు..

మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. సభకు పరుషుల కంటే అత్యధికంగా మహిళలు తరలివచ్చారు. మోదీ పేరు పలకరింపుతో సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లిపోయింది. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.3,100 ప్రకటిస్తున్నామని షా అనడంతో సభలో ఉన్న రైతులు, వేదికపై ఉన్న నాయకులు చప్పట్లతో స్వాగతించారు. ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయే సమయంలో అమిత్‌ షా గ్యాలరీ వద్దకు వచ్చి ప్రజలు, యువతకు అభివాదం చేశారు. ఆయనను దగ్గర నుంచి చూసేందుకు పోటీ పడడంతో.. ఇనుప గేట్లు సైతం ఊడిపోయే పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని అమిత్‌ షాను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సభ నుంచి వెళ్లి పోయే జనం మోదీ, అమిత్‌షా చిత్రపటాలను వెంట తీసుకెళ్లారు. హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్‌ రోడ్డు వైపు ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు కేవీఎల్‌ఎన్‌.రెడ్డి, రామకృష్ణ, శివరాజ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యాయానికి, అధర్మానికి మధ్య పోరాటం

జనగామ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు న్యాయం, అధర్మం మధ్య జరుగుతున్న పోరు అని.. ప్రజలు బీజేపీ వైపు ఉండాలని జనగామ అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం సమానంగా జరుగుతాయన్నారు. జనగామ జిల్లా ఉద్యమ సమయంలో ఈ ప్రాంతాన్ని తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తే అన్ని వర్గాల ప్రజలతో కలిసి తాను చేసిన ఉద్యమంతో ఇక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మూడు నెలల పాటు ఈగడ్డపై అడుగు పెట్టలేదన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ ప్రాంతానికి పైసా ఇ వ్వలేదని, రంగులు మార్చే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ని గెలిపిస్తే.. అదే పార్టీలో ఉంటారా? లేదా అని సొంత పార్టీ కేడర్‌ అనుమానానిస్తోందన్నారు.

అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించండి

కబ్జాలకు కేరాఫ్‌గా ప్రస్తుత ఎమ్మెల్యే

ధాన్యం క్వింటాకు

మద్దతు ధర రూ.3,100

జనగామ బహిరంగ సభలో

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

శ్రేణుల్లో ఉత్తేజం నింపిన ‘షా’ సభ

అమిత్‌ షా సభ సైడ్‌లైట్స్‌

మధ్యాహ్నం 1.20 గంటలకు: బతుకమ్మ కుంట హెలిపాడ్‌ వద్ద హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ అయింది.

1.25 గంటలకు: జనగామ గడ్డపై షా అడుగు పెట్టారు.

1.30 గంటలకు : ప్రెస్టన్‌ మైదానం సబావేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ...భారత్‌మాతాకీ జై... వందేమాతరం అంటూ దేశభక్తిని చాటారు.

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి అభ్యర్థులతో కలిసి అభివాదం చేశారు.

1.38గంటలకు: ప్రసంగం ప్రారంభించారు.

1.57 గంటలకు: ప్రసంగం ముగింపు..

1/3

సభలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పక్కన దశమంతరెడ్డి
2/3

సభలో ప్రసంగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పక్కన దశమంతరెడ్డి

3/3

Advertisement
Advertisement