కమలంలో ఖుషి.. | Sakshi
Sakshi News home page

కమలంలో ఖుషి..

Published Sun, Nov 19 2023 1:02 AM

- - Sakshi

ఓరుగల్లు సకల జనుల

విజయ సంకల్ప సభ సక్సెస్‌తో బీజేపీలో జోష్‌

బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా సాగిన కేంద్ర

హోంమంత్రి అమిత్‌షా ప్రసంగం

కేసీఆర్‌ అవినీతి పెరిగిపోయిందని,

కక్కిస్తామని వ్యాఖ్యలు..

కేంద్రం కేటాయించిన నిధులు,

సంక్షేమ పథకాలపై వివరణ

వరంగల్‌ ఎంజీఎంకు రూ.వెయ్యి

కోట్లు కేటాయిస్తామని హామీ

డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తేనే

మరింత అభివృద్ధి

వరంగల్‌ పుణ్య భూమిపై అడుగు

పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి

ఖిలా వరంగల్‌: ఎన్నికల ప్రచారం మొదలయ్యాక తొలిసారి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వరంగల్‌కు రావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఖిలా వరంగల్‌ మైదానంలో శనివారం జరిగిన బీజేపీ ఓరుగల్లు సకల జనుల విజయ సంకల్ప సభకు జనం నుంచి భారీగా స్పందన రావడంతో ఆ పార్టీ నాయకులు ఖుషీలో ఉన్నారు. అమిత్‌షా ప్రసంగం మొత్తం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ.. కేంద్ర సంక్షేమంపై సుదీర్ఘంగా వివరణ ఇస్తూ సాగింది. సభ ప్రారంభానికి ముందే భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌ షా నేరుగా కాన్వాయ్‌లో సభా మైదానానికి చేరుకున్నారు. వేదికపైకి చేరుకుని హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులను పరిచయం చేసి ప్రసంగం మొదలుపెట్టారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తే తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి జరుగుతుందని, అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపిస్తే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పగా, సభకు వచ్చిన జనం చప్పట్లు, కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. ఓరుగల్లుకు గొప్ప చరిత్ర ఉందని, కాకతీయుల కళారాజ్యంలో భద్రకాళి, రామప్ప లాంటి ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, అటువంటి పుణ్య భూమిపై అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ప్రజల ప్రగతి కోసం ఎంతో చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్‌ కాళీప్రసాద్‌రావు, కొండేటి శ్రీధర్‌, కంభంపాటి పుల్లారావు, కీర్తిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పాలనపై విమర్శల వెల్లువ

పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ నాశ నం చేశారని అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. సర్వ సంపన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ పాలనలో అవినీతి, కుంభకోణాలతో అప్పులకుప్పగా మార్చారని దుమ్మెత్తి పోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయలో అవినీతి, అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఇలా లెక్కబెట్టాలంటే వారం రోజులు పడుతుందని ఆరోపించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికి రోగి చనిపోయినా పట్టింపులేదని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.వేల కోట్లు కేటాయించి అభివృద్ధిలో వరంగల్‌ను ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు డాక్టర్‌ రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, వన్నా ల శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి, జయపాల్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, లక్ష్మీప్రసాద్‌, కుసుమ సతీష్‌, గంట రవికుమార్‌, అల్లం నాగరాజు, కందిమల్ల మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అమిత్‌ షా పర్యటన సాగిందిలా..

సాయంత్రం 4.20 గంటలకు హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాక

4.32 గంటలకు: ఖిలా వరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌ సభ వద్దకు ..

4.36 గంటలకు : ప్రసంగం ప్రారంభం.

4.54 గంటలకు: ప్రసంగం ముగింపు

4.55 గంటలకు: ఎయిర్‌పోర్ట్‌కు వాహనంలో బయల్దేరిన అమిత్‌ షా

5.10 గంటలకు : ఎయిర్‌పోర్ట్‌నుంచి హైదరాబాద్‌కు పయనం

1/3

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement