Sakshi News home page

యువ జపం!

Published Fri, Nov 17 2023 1:16 AM

- - Sakshi

నవ, యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థుల పాట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన యువత

వారి చేతిలోనే నేతల భవిత... ఎమ్మెల్యేలుగా గెలవాలంటే ఆ ఓట్లే కీలకం..

గెలుపోటములు నిర్ణయించేది వీరే... 18–29 మధ్యన 7,05,286 మంది..

30 నుంచి 39 వయస్సుగల ఓటర్లు 7,65,172 మంది

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : అసెంబ్లీ ఎన్నికల పోరు ఉమ్మడి వరంగల్‌లో పతాకస్థాయికి చేరుకుంటోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణతో తర్వాత ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు అధికా రంలోకి వస్తే ఏమి చేస్తామో చెబుతూ యువ, నవ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు పడరాని పాట్లు పడతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 29,74,631 మంది ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.

యువతే కీలకం..

ప్రచారం సహా ఓటింగ్‌లోనూ ప్రభావం

ప్రశ్నించే గుణం, స్పందించే తత్వం కలిగిన యువత సహజంగానే ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావితమవుతుంది. ఎన్నికల తరుణంలో రాజకీయ చర్చల నుంచి మొదలుకొని అన్ని పార్టీల తరఫున ప్రచారం చేయడం, సాంకేతిక సహకారం అందించడం వరకు తమవంతు పాలుపంచుకుంటుండగా ఇటీవల ఓటు నమోదు, ఓటింగ్‌శాతం పెంచడం, సచ్ఛీలురను ఎన్నుకునేలా కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో యువత అధికంగా ఉండడంతో యువచైతన్యం వెల్లివిరుస్తుండగా వచ్చే ఎన్నికల్లో వీరే కీలకంగా మారనున్నారు. అత్యధిక జనసాంద్రత కలిగిన ఓరుగల్లు జిల్లాలో విద్యానుకూల పరిస్థితులు చైతన్యానికి దోహదం చేస్తున్నాయి. జిల్లాలో కేయూసీ, నిట్‌, హెల్త్‌ యూనివర్సిటీ, వెటర్నరీ, వ్యవసాయ పాలిటెక్నిక్‌, వ్యవసాయ డిగ్రీ, వ్యవసాయ పీజీ కళాశాలలు, పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ, వొకేషనల్‌ కళాశాలలుండటం, నిరుద్యోగ యువత అధికంగా ఉండడంతో పలు కళాశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమాలు, న్యాక్‌ కేంద్రం, ఐటీఐ, ఇతరత్రా యువజన, స్వచ్ఛంద సంస్థలు తమవంతుగా ఓటరు అవగాహన సదస్సులు చేపడుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారానూ వీరు ఓటరు చైతన్యం, ఓటు నమోదు, ఓటు వేయడం, పోలింగ్‌, పార్టీల పాత్ర తదితర చాలా అంశాలపై పెద్దఎత్తున స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా, గ్రూపులుగానూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండగా వీరిలో కొందరు పార్టీల ద్వారానూ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. యువత తాము నమ్మిన అంశాలను తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆచరింపజేస్తారు కాబట్టి ఓటింగ్‌ సరళిని మార్చడమనేది వారి చేతిలోనే ఉన్నందున ప్రస్తుత ఎన్నికల్లో ఆకట్టుకోవడంపై అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.

Advertisement
Advertisement