ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత | Sakshi
Sakshi News home page

ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత

Published Tue, May 14 2024 11:05 AM

ఓటేసి

డెంకాడ: అంతవరకు బాగానే ఉన్నాడు. భార్యతో కలిసి ఓటు వేసి ఇంటికి వచ్చిన కాసేపటికి ఆ వృద్ధుడు మరణించాడు. ఈ విచారకర సంఘటన మండలంలోని డెంకాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. డెంకాడ గ్రామానికి చెందిన కోయనేని సత్యం (85) భార్య చంద్రమ్మతో కలిసి పోలింగ్‌ బూత్‌కి వెళ్లి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అక్కడకు కొద్దిసేపటి తర్వాత కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

గజపతినగరం: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడకు చెందిన దుప్పాడ అసిరయ్య తన పనులు ముగించుకుని గ్రామానికి వస్తుండగా... గ్రామ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అసిరయ్యను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు కార్తీక్‌ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

రామభద్రపురం: మండలంలోని ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఇక్బాల్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓలతో మాట్లాడుతూ, పోలింగ్‌ సరళిపై ఆరా తీశారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్‌ సులోచనారాణి ఉన్నారు.

కొత్తూరులో

ఈదురుగాలుల బీభత్సం

పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఎగిరిపోయిన టెంట్లు

నిలిచిన విద్యుత్‌ సరఫరా

కొత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ కొత్తూరులో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు నేలకొరిగాయి. పలుచోట్లు చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పోలింగ్‌ స్టేషన్ల వద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. అవి కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారం అలముకుంది. విద్యుత్‌ సరఫర నిలిచిపోవడంతో పోలంగ్‌ స్టేషన్‌ వద్ద జనరేటర్లు సక్రమంగ పనిచేయక పోవడంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు, మెట్టూరులతో పాటు పలు గ్రామాల్లో గంటల తరబడి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కొత్తూరుతో పాటు పలు పోలింగ్‌స్టేషన్‌లను అడిషనల్‌ ఎస్పీ ప్రేమ్‌కాజల్‌ సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

అంధవరంలో దాడి

జలుమూరు: మండలంలోని అంధవరం పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సవలాపురం రాముపై అదే గ్రామానికి చెందిన పల్లి శంకరరావు, తిరుమలరావులు సోమవారం దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు పడటంతో ఓర్వలేని టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే మాటలు ఆడుతూ ఓటు వేసి వచ్చిన రామును నేలపై దొర్లించి రాయితో కంటి కింద గాయం చేశారు. స్థానిక వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మధుసూదనరావు సిబ్బందితో వెళ్లి పరిస్థితి సద్దుమణిగించారు.

ఓటేసిన కొద్ది సేపటికే  మృత్యువాత
1/2

ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత

ఓటేసిన కొద్ది సేపటికే  మృత్యువాత
2/2

ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత

Advertisement
 
Advertisement
 
Advertisement