కెమికల్‌ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు | Sakshi
Sakshi News home page

కెమికల్‌ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు

Published Sun, May 26 2024 4:35 AM

-

మురళీనగర్‌ : కెమికల్‌ ఇంజినీరింగ్‌లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని అనకాపల్లి జిల్లా కో–ఆపరేటివ్‌ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎ.పి. స్వరూపారాణి అన్నారు. కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (గైస్‌)లో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటరమణ అధ్యక్షతన శనివారం జాబ్‌ అచీవర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒక విద్యా సంవత్సరంలో గైస్‌ నుంచి వంద మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రెడ్డిపల్లి శ్రీనివాస్‌, ఆంధ్రా పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ కంపెనీల తరఫున విద్యార్థుల ఇండస్ట్రియల్‌ శిక్షణకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ప్రిన్సిపాల్‌ వెంకటరమణ మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరంలో తమ కాలేజీ నుంచి వంద మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. అత్యధికంగా రూ.4 లక్షల వార్షిక ప్యాకేజీతో నలుగులు విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా ఆంధ్రా పెట్రో కెమికల్స్‌లో 26 మంది రూ.3.6 లక్షలు, ఐటీసీ భద్రాచలంలో ఆరుగురు రూ.3.82 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక ఉత్తర్వులను డిప్యూటీ రిజిస్ట్రార్‌ స్వరూపారాణి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్‌ రిటైర్డ్‌ పీఆర్‌వో శర్మ, గైస్‌ పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.దేముడు, బెల్‌ రిటైర్డ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఎ.వరహాలు, కాలేజీ హెచ్‌వోడీలు డాక్టర్‌ బీవీ లక్ష్మణరావు, సీహెచ్‌ జయప్రకాష్‌రెడ్డి, డి.దామోదర్‌, ఎస్‌.ప్రశాంత కుమారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement