Sakshi News home page

‘ఉత్తర’ అభివృద్ధికి కేకే రాజు విశేష కృషి

Published Fri, Mar 29 2024 1:15 AM

- - Sakshi

● వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ● అట్టహాసంగా పార్టీ ఉత్తర కార్యాలయం ప్రారంభం

సీతమ్మధార: ‘గత ఎన్నికల్లో ఉత్తరం నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే తర్వాత ఒక్కసారి కూడా ప్రజలకు కనిపించలేదు. కానీ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు నిరంతరం ప్రజల్లో ఉండి.. వారి కష్టాల్లో తోడయ్యారు. అందరి బాగోగులు తెలుసుకుని అండగా నిలిచారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కె.కె.రాజుకు ఓటు వేసి గెలిపిస్తే ఉత్తర నియోజకవర్గ ప్రజలకు మరింత జరుగుతుంది.’ అని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. కె.కె.రాజు ఆధ్వర్యంలో బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ఉత్తర కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2014లో చంద్రబాబు కూటమిగా వచ్చి ప్రజలను మోసం చేశారని, అందుకే 2019లో టీడీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. అధికార కాంక్షతో ఈ ఎన్నికల్లో మళ్లీ కూటమిగా ఏర్పడి మభ్యపెట్టేందుకు వస్తున్నారని.. కూటమి కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్య ప్రజలకు అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నారని, విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొచ్చారన్నారు. అన్ని రంగాలకు పెద్దపీట వేసి సుపరిపాలన అందించారన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి వెనుక కె.కె.రాజు శ్రమ ఎంతో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ మన భవిష్యత్‌ మన చేతుల్లో ఉందని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ గెలిపించుకుందామన్నారు. విశాఖ ఆడపడుచుగా ముఖ్యమంత్రి తనకు అవకాశం కల్పించారని, ఇక్కడ గెలిచి విశాఖ రుణం తీర్చుకుంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో కె.కె.రాజు కృషి ఎంతో ఉందన్నారు. ఇద్దరినీ ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, ఎస్‌.ఎ.రెహ్మన్‌, చింతపూడి వెంకటరామయ్య, మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్‌ సనపల చంద్రమౌళి, ఉత్తర ఎన్నికల పరిశీలకులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement