ఓటమి తప్పదనే.. | Sakshi
Sakshi News home page

ఓటమి తప్పదనే..

Published Wed, Nov 22 2023 4:24 AM

మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నేత నర్సింహారెడ్డి - Sakshi

మోమిన్‌పేట: మూడోసారి ఓటమి తప్పదని గుర్తించిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత, చీమల్‌దరి సర్పంచ్‌ నాసన్‌పల్లి నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మోమిన్‌పేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రసాద్‌కుమార్‌ తనపై చేసిన వ్యక్తిగత ఆరోపణలను ఖండించారు. ప్రసాద్‌కుమార్‌ మంత్రిగా ఉన్న సమయంలో తమ గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడాన్ని జీర్ణించుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతో పాటు తమ పార్టీ పెద్దలపై చేసిన ఆరోపణలన్నీ ఆయనకే వర్తిస్తాయని ఎద్దేవాచేశారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక నిరాధార ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, బదిలీలు చేయిస్తానని చెప్పి ఎవరివద్ద ఎంత తీసుకున్నాడో.. తన వద్ద సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. వికారాబాద్‌లో ఉన్న భూమిని నలుగురికి అమ్మి.. అడ్వాన్సులు తీసుకుని బెదిరించిన సంగతి నిజం కాదా..? అని ప్రశ్నించారు. స్థానికుల సహకారంతోనే తమ గ్రామంలో గుడి నిర్మించుకున్నామని వివరించారు. తాను ఒక్క గుంట భూమిని కబ్జా చేసినట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి రూ.300 కోట్లు కాదు కదా.. రూ.30 అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఆయన చెప్పినవన్నీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం గుర్తించాలని సూచించారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలను మానుకోకపోతే ఆయన బండారం అంతా బయట పెడుతామని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement