కర్ణాటక సరిహద్దులో నిఘా పెంచండి | Sakshi
Sakshi News home page

కర్ణాటక సరిహద్దులో నిఘా పెంచండి

Published Thu, Nov 9 2023 7:14 AM

- - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కర్ణాటక నుంచి రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా సహకరించాలని కలెక్టర్‌ సీ నారాయణరెడ్డి కర్ణాటక రాష్ట్రం కలబురిగి కలెక్టర్‌, ఎస్పీని కోరారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కలబురిగి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దులోని వికారాబాద్‌, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కర్ణాటకలోని ఏడు సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకోవచ్చని తెలిపారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని ఏడు చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి సహకరించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నిక లు జరగనున్నందున ఆ రాష్ట్ర అధికారులు సహకరించాలని కోరారు. అనంతరం కలబురిగే కలెక్టర్‌ మాట్లాడుతూ.. తమ ప్రాంతం నుంచి మద్యం, డబ్బు, గంజాయి అక్రమ రవాణా కాకుండా చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.

20లోగా ఓటర్‌ ఐడీ కార్డులు పంపిణీ చేయాలి

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలో దరఖాస్తు చేసుకున్న కొత్త ఓటర్లకు ఈ నెల 20లోగా ఓటరు ఐడీ కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షల మంది దరఖాస్తు చేశారని, వారందరికీ కార్డులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ కృష్ణన్‌, ఎన్నికల అధికారి శంకరాచారి పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి

పరిగి: జిల్లాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూంలో వసతుల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్ల వాహనాల పార్కింగ్‌కు స్థలం కేటాయించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, ఆర్‌ఓ విజయకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, ఆర్‌ఆండ్‌బీ డిప్యూటీ ఈఈ సురేందర్‌ పాల్గొన్నారు.

కలబురిగి జిల్లా కలెక్టర్‌, ఎస్పీని కోరిన వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి

డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచన

Advertisement
Advertisement