మాజీ ఐపీఎస్‌ భార్య హత్య కేసులో కీలక పరిణామం | Update on Jubilee Hills incident | Sakshi
Sakshi News home page

మాజీ ఐపీఎస్‌ భార్య హత్య కేసులో కీలక పరిణామం

Oct 19 2026 3:57 AM | Updated on Oct 19 2026 3:57 AM

Update on Jubilee Hills incident

టాస్క్ ఫోర్స్‌ అదుపులో కల్పన సహా ముగ్గురు  

మరో దోపిడీకి పథకం.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి మళ్లీ ఒక్కటైన ముఠా

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌రాయ్‌ భార్య తనూజా రంజన్‌ హత్య, దోపిడీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న కల్పన అలియాస్‌ ధర్మతో పాటు మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన అనంతరం నేపాల్‌కు పారిపోయిన నిందితులు.. మరో దోపిడీకి పథకం వేసి తిరిగి భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

 వివరాల్లోకి వెళితే.. ప్రశాసన్‌నగర్‌లో నివసించే మాజీ ఐపీఎస్‌ వినయ్‌రంజన్‌రాయ్‌ సతీమణి తనూజ రంజన్‌ను ఇంట్లో పనిచేసే కల్పన అలియాస్‌ ధర్మ, సురేష్‌ షాహి అలియాస్‌ సృజన్‌షాహి, గణేష్‌ బికాస్, కంచ లామా మరో ముగ్గురితో కలిసి పథకం వేసి మే 8న తనూజ రంజన్‌ను హత్య చేసి ఇంట్లోని బంగారు ఆభరణాలతో సహా పరారయ్యారు. పోలీసులు సైతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విమానాల్లో నేపాల్‌ సరిహద్దులకు వెళ్లినా, నిందితులంతా పోలీసులు కళ్లు గప్పి భారత్‌ సరిహద్దులను దాటి నేపాల్‌లోకి చేరుకున్నారు. 

దీంతో నిందితులను తిరిగి తీసుకురావడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ క్రమంలోనే సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ నిందితులను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్‌ బృందాన్ని ఏర్పాటుచేశారు.  15 రోజుల క్రితం మరో దోపిడీకి పథకం వేసుకుని కల్పనతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ప్రాంతాలకు చేరుకున్నట్లు టాస్క్ ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది.

 దీంతో పోలీసులు వేర్వేరు బృందాలుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి నలుగురు నిందితులను తీసుకుని నగరానికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తతం వారిని టాస్క్ ఫోర్స్‌ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కేసులో పాల్గొన్న మొత్తం ఏడుగురిలో ప్రస్తుతం నలుగురు పోలీసుల అదుపులో ఉండగా మరో ముగ్గురు నేపాల్‌లోనే ఉన్నట్లు టాస్క్ ఫోర్స్‌ బృందం గుర్తించింది.నిందితులు చోరీ చేసి తీసుకువెళ్లిన బంగారు ఆభరణాలను గుర్తించి పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనలో వీరికి సహకరించిన నేపాల్‌కు చెందిన సునీల్‌పరియార్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement