‘ఫ్యూచర్‌’కు సాగరా? పాలమూరా? | Telangana Focuses on Krishna Water Supply for Drinking Needs | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌’కు సాగరా? పాలమూరా?

Oct 19 2026 4:03 AM | Updated on Oct 19 2026 4:03 AM

Telangana Focuses on Krishna Water Supply for Drinking Needs

కృష్ణా నీటి తరలింపు అంశాలపై మల్లగుల్లాలు 

జలమండలి మదిలో కృష్ణా మూడోదశ 

మరోవైపు చిక్కుముడుల పాలమూరు–రంగారెడ్డి సైతం.. 

 డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీరు 

తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల సరఫరా  

ప్రాథమికంగా డీపీఆర్‌కు సిద్ధమవుతున్న జలమండలి 

ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందడుగు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తోంది. తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక కార్యాచరణను తయారు చేస్తున్న సర్కారు.. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే, ఈ జలాలను ఎక్కడి నుంచి తరలించాలనే అంశంపై మాత్రం తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కృష్ణా మూడో దశ నుంచి ఈ జలాలను తరలించాలా? నిర్మాణ దశలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి తీసుకురావాలా? అనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.

ఈ నేపథ్యంలోనే జలమండలి మాత్రం సర్కారు నిర్ణయానికి అనుగుణంగా ముందడుగు వేయాలని భావిస్తోంది. మరోవైపు ఫూచర్‌ సిటీలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు లైఫ్‌ సైన్సెస్, ఈవీ పార్క్, ఏఐ సిటీ, హెల్త్‌ సిటీ, ఎడ్యుకేషన్‌ సిటీ వంటి కీలక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల టాటా సంస్థ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ డేటా సెంటర్లకు, ఐటీ, ఇతర బడా పరిశ్రమల అవసరాలకు నీరు చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకున్న వాటర్‌బోర్డు ఫ్యూచర్‌సిటీ నీటి అవసరాలను తీర్చడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీటిని తరలించాలని నిర్ణయించింది. తాగునీటి అవసరాలను తీర్చడానికి కృష్ణా జలాలను సరఫరా చేయాలనే దిశగా ఆలోచన చేస్తోంది.  

రెండు ప్రతిపాదనలు...
ఫ్యూచర్‌ సిటీకి తాగునీటిని తరలించేందుకు ప్రస్తుతం రెండు భిన్నమైన మార్గాలు, రెండు శాఖల పరిధిలోని ప్రణాళికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మొదటిది జలమండలి పర్యవేక్షణలో ఇప్పటికే దిగి్వజయంగా నడుస్తున్న కృష్ణా తాగునీటి సరఫరా పథకంకాగా, రెండోది నీటిపారుదల శాఖ అ«దీనంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకం. నీటి శుద్ధి, పంపిణీ, రోజువారీ నిర్వహణలో జలమండలికి దశాబ్దాల అనుభవం ఉంది. మరోవైపు భారీ జలాశయాలు, కాలువలు, ఎత్తిపోతల నిర్వహణ నీటిపారుదల శాఖ ప్రత్యేకం. 

ఒకవేళ పాలమూరు–రంగారెడ్డి మార్గాన్ని ఎంచుకుంటే నీటి కేటాయింపులు, విడుదల, శుద్ధి, సరఫరా వంటి ప్రతి దశలోనూ రెండు శాఖల మధ్య నిరంతర సమన్వయం అవసరమవుతుంది. అదే కృష్ణా మూడో దశ మార్గాన్ని ఎంచుకుంటే, వనరు నుంచి వినియోగదారుడి వరకు ఒకే సంస్థ (జలమండలి) బాధ్యత వహించే వీలుంటుంది. గతంలో కన్సల్టెంట్లు ఇచి్చన నివేదికల్లో సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చే ప్రతిపాదనలు ఉండగా, అంత దూరం నుంచి తెచ్చే కంటే అందుబాటులో ఉన్న లైన్‌ను వాడుకోవడమే ఉత్తమమన్న ఆలోచన రావడంతో జలమండలి పైప్‌లైన్‌ మార్గం, అవసరమయ్యే నీటి పరిమాణం, నిర్మాణ వ్యయంతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. 

గోదావరి ఫేజ్‌–2, 3 భర్తీ భరోసా 
కృష్ణాలైన్‌ నుంచి భావినగరికి నీటిని మళ్లిస్తే, హైదరాబాద్‌ నగరానికి తగ్గే నీటి వాటాను ‘గోదావరి ఫేజ్‌–2, 3’ప్రాజెక్టు ద్వారా భర్తీ చేయవచ్చని జలమండలి వ్యూహాత్మక ప్రణాళిక వేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరానికి అదనంగా 300–320 ఎంజీడీల నీరు లభిస్తుంది. అయితే, మల్లన్నసాగర్‌ నీరు నగరానికి చేరేందుకు 2027 చివరి వరకు సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ గోదావరి ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కాకపోతే, ఆ లోపే కృష్ణా నీటిని ఫ్యూచర్‌ సిటీకి మళ్లించడం వల్ల హైదరాబాద్‌ నగరంలో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితి, దశలవారీ నీటి బదిలీ షెడ్యూల్‌తో ముందడుగు వేయాల్సి ఉంది.

సాంకేతిక బలం ఉన్న కృష్ణా పథకం
నాగార్జునసాగర్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నుంచి కృష్ణా 1, 2, 3 దశల ద్వారా జలమండలి ప్రతిరోజూ 270 ఎంజీడీల (మిలియన్‌గ్యాలన్ల) నీటిని నగరానికి తరలిస్తోంది. ఇందులో మూడో దశ కింద కోదండాపూర్‌ నుంచి సాహెబ్‌నగర్‌ వరకు 110 కిలోమీటర్ల మేర 2,375 మి.మీ వ్యాసం గల భారీ పైప్‌లైన్‌ వేశారు. నల్గొండ జిల్లాలోని ఇంటేక్, పంపింగ్‌ స్టేషన్లు, కోదండాపూర్, నాసర్లపల్లి, గోడకొండ్ల వద్ద శుద్ధి కేంద్రాలు, గున్‌గల్‌ వద్ద మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఈ దశకు వెన్నెముకగా ఉన్నాయి. ఫ్యూచర్‌ సిటీకి కృష్ణా పైప్‌లైన్‌ కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇదే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. 

అయితే, ఈ మార్గం నుంచి నీటిని మళ్లించాలంటే ప్రస్తుత పంపింగ్‌ మెయిన్, శుద్ధి కేంద్రాల్లో ఉన్న అదనపు సామర్థ్యాన్ని సాంకేతికంగా లెక్కించాల్సి ఉంటుంది. అవసరమైతే కొత్త పంపులు, బూస్టర్‌ స్టేషన్లు, కొత్త అనుసంధాన ఫీడర్‌ లైన్‌ నిర్మించాల్సి ఉంటుంది. ఎండాకాలంలో సాగర్‌లో నీటిమట్టం 510 అడుగుల కంటే కిందకు పడిపోయినా నీటి కొరత రాకుండా రూ.2,214 కోట్లతో చేపట్టిన సుంకిశాల ఇంటేక్‌ వెల్‌ ప్రాజెక్టు కూడా కృష్ణా లైన్‌కు తిరుగులేని సాంకేతిక బలాన్ని ఇస్తోంది. 

మరోవైపు కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న తాత్కాలిక నీటి కేటాయింపుల వివాదం కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఇంకా నలుగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం, వ్యయభారం పెరుగుతూపోవడం, అన్ని రకాల పర్యావరణ, న్యాయ చిక్కులు, వాటాల వివాదాలు దాటుకుని ఫ్యూచర్‌ సిటీ వంటి కొత్త ప్రాజెక్టుకు పాలమూరు నుంచి తక్షణమే నీటిని కేటాయించడం సంక్లిష్టంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement