ఇక అడ్వాన్స్‌ టెండర్లు! | In the current academic year kits have yet to be fully delivered in many places | Sakshi
Sakshi News home page

ఇక అడ్వాన్స్‌ టెండర్లు!

Oct 23 2026 4:51 AM | Updated on Oct 23 2026 4:51 AM

In the current academic year kits have yet to be fully delivered in many places

విద్యా సంస్థల్లో 2027–28 విద్యా సంవత్సరం కిట్లపై హడావుడి షురూ

మార్చిలోపే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా అధికారుల వ్యూహాత్మక కార్యాచరణ

ప్రస్తుత విద్యా సంవత్సరంలో చాలా చోట్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందని కిట్లు 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్‌ విధానంలో నిర్వహించే పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు అందించే సరుకులను విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు టెండర్లకు సన్నద్ధమవుతోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం, కాంట్రాక్టర్ల ఎంపికలోనూ తాత్సారం జరగడంతో విద్యార్థులకు ఇప్పటికీ పూర్తిస్థాయి­లో కిట్లు అందలేదు. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి ముందస్తుగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన అధికారులు... ఈ దిశగా కసరత్తు ప్రారంభించారు. 

ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినట్టు సరుకులను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు పాఠశాల వారీగా డిమాండ్‌ వివరాలను సేకరిస్తున్నారు. కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో చేసే కొనుగోలు ప్రక్రియ ద్వారా పది రకాల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వస్తువులు అందిస్తున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9,24,107 మంది విద్యార్థులున్నట్టు అంచనా వేసిన అధికారులు, ఆ మేరకు టెండర్లు పూర్తి సరుకులు కొనుగోలు చేశారు. విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, సాక్స్, బ్యాగ్, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు, రగ్గులు, దుప్పట్లు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్‌ డ్రెస్, ట్రాక్‌ సూట్, ట్రాలీబ్యాగ్స్, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్‌ తదితర 22 రకాల వస్తువులు కొనుగోలు చేసి కిట్‌ రూపంలో అందిస్తారు.

జిల్లా స్థాయిలో సమాచార సేకరణ 
2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల వారీ డిమాండ్‌ను అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో గురుకుల సొసైటీలు జిల్లా కోఆర్డినేటర్లకు, సంక్షేమ శాఖలు సంబంధిత జిల్లా అధికారులకు బాధ్యతలు అప్పగించాయి. ఇందులో భాగంగా రెండ్రోజులుగా జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమ అధికారులు పాఠశాల/హాస్టల్‌ వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు సమర్పించనున్నట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు.

పూర్తిస్థాయిలో అందని కిట్లు 
కొత్త టెండర్ల కోసం అధికారులు హడావుడి చేస్తుండగా... ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ చేయలేదు. కేవలం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయగా, యూనిఫాం రెండు జతలకుగాను కొన్నిచోట్ల ఒక జత మాత్రమే అందించారు. అదికూడా చాలాచోట్ల అన్‌సైజ్‌లో ఉండడంతో కొందరు వెనక్కి ఇచ్చేశారు. బెడ్‌షీట్లు, రగ్గులు ఇప్పటివరకు 30 శాతం లోపే పంపిణీ చేసినట్టు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ట్రాక్‌ సూట్లు, ట్రాలీబ్యాగులు చాలామందికి పంపిణీ చేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement