గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

Published Wed, Nov 15 2023 2:04 AM

గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా జెండా ఎగురవేస్తున్న చైర్‌పర్సన్‌ సువ్వారి సువర్ణ 
 - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: ప్రజల తలరాత మార్చేది అక్షరమేనని అని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు సువ్వారి సువర్ణ అన్నారు. 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ 134వ జయంతి సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలల కోసం గ్రంథాలయ వారోత్సవాలు జరపడం శుభ పరిణామన్నారు. వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు.

గ్రంథాలయ కార్యదర్శి బి.కుమార్‌ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించి గ్రంథాలయానికి రావాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా 14వ తేదీన బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శనల ఏర్పాటు, మాదక ద్రవ్యాలపై అవగాహన, పుస్తక పఠన ప్రాముఖ్యత, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్‌ ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, తదితర వారిని స్మరించడం, 17న కవితా దినోత్సవం, సెమినార్లు, రచయితల సందేశాలు, 18న పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌, క్రీడల పోటీలు ఉంటాయన్నారు. 19న మహిళా దినోత్సవం, ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాలు, 20న అక్షరాస్యతా దినోత్సవం, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఉంటాయని వివరించారు. ముందుగా పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాల మాన్‌ సింగ్‌, వైయస్సార్‌ సీపీ నాయకులు సువ్వారి సత్యనారాయణ (ఢిల్లీ ), డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు, డా.ఇ.ఎస్‌.సంపత్‌ కుమార్‌, ఉప గ్రంధాలయ అధికారి వి.వి.జి.ఎస్‌.శంకర్‌రావు, గ్రంధాలయ అధికారులు, సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement