సెల్‌ఫోన్లకు అనుమతి లేదు | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్లకు అనుమతి లేదు

Published Sat, May 25 2024 11:35 AM

సెల్‌ఫోన్లకు అనుమతి లేదు

ఎన్నికల కమిషన్‌ నిబంధనల

మేరకు కౌంటింగ్‌ జరగాలి

జిల్లా ఎన్నికల అధికారి అరుణ్‌బాబు

పుట్టపర్తి అర్బన్‌: కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌బాబు స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జరగాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారులు, ఏఈఆర్‌ఓ, సహాయక సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై తొలి విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన ఇచ్చారు.

పొరపాట్లకు తావివ్వొద్దు..

కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలన్నారు. చిన్న పొరపాటుకు సైతం తావివ్వొద్దన్నారు. హిందూపురం పార్లమెంట్‌తో పాటు 6 అసెంబ్లీ నియోజక వర్గాల కౌంటింగ్‌ జిల్లాలోనే జరుగుతుందన్నారు. జూన్‌ 4వ తేదీన ఉదయం 8 గంటలకే లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్‌ విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఒక వైపు పోస్టల్‌ బ్యాలెట్లు, మరో వైపు ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు అధికంగా పోలైనందున లెక్కింపునకు అధిక సమయం పడుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ వీడియో రికార్డింగ్‌ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు ధరించాలన్నారు. కౌంటింగ్‌ హాల్‌లో ఆర్‌ఓలదే సర్వాధికారమన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పక్కాగా ఉండాలి..

జేసీ అభిషేక్‌ కుమార్‌ మాట్లాడుతూ, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంట్‌ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి పోలైన ఓట్లను ప్రత్యేకంగా లెక్కిస్తామన్నారు. అభ్యర్థులకు పోలైన పోస్టల్‌ బ్యాలెట్లను వివిధ దశల్లో పరిశీలన చేసి అన్నీ పక్కాగా ఉన్న వాటినే లెక్కింపులోనికి తీసుకుంటామన్నారు. సమావేశంలో పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, రిటర్నింగ్‌ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివరామిరెడ్డి, గౌరీ శంకర్‌, సన్నీ వంశీకృష్ణ, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement