ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, May 25 2024 11:30 AM

ప్రతి

పెనుకొండ: పది, ఇంటర్‌లో ప్రతిభ చాటుకున్న వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2023–24 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 480కు పైబడి మార్కులు, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు 510కు పైబడి మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు 800కు పైబడి, ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు 850కు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, సెల్‌ నంబర్‌, చిరునామాతో కూడిన వివరాలను 89191 21041 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలి. ఎంపికై న వారికి జూన్‌ 16న హిందూపురంలోని వాల్మీకి భవన్‌లో పురస్కారాలను అందజేస్తారు.

రెండో రోజూ హుండీల ఆదాయం లెక్కింపు

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ రెండో రోజు శుక్రవారమూ కొనసాగింది. 50 రోజులకు గాను హుండీలు లెక్కించగా తొలి రోజు రూ.71,70,337, రెండో రోజు రూ.8,24,194 నగదుతో పాటు 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి రమేష్‌ బాబు, కదిరి ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌ రాఘవేంద్ర, బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నాలుగో రోజు కొనసాగిన సిట్‌ విచారణ

తాడిపత్రి అర్బన్‌: ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రి చోటు చేసుకున్న అల్లర్లపై సమగ్ర విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందజేసిన సిట్‌ అధికారులు... మరింత లోతైన విచారణలో భాగంగా రెండో విడత తాడిపత్రికి విచ్చేశారు. ఇప్పటికే మూడు రోజులుగా విచారణ కొనసాగింది. నాలుగో రోజు శుక్రవారం కూడా విచారణను అధికారులు చేపట్టారు. మూడు రోజులుగా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మకాం వేసిన సిట్‌ బృందం అల్లర్లకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను శుక్రవారం పరిశీలించింది. ఇప్పటి వరకూ నిందితుల్లో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు అనే అంశాలపై పరిశీలిస్తోంది. అంతేకాక అల్లర్లకు ముందు టీడీపీ వర్గీయులు భారీ సంఖ్యలో జేసీ నివాసం వద్దకు ఎలా చేరుకున్నారు అనే విషయంపై సిట్‌ బృందం లోతుగా విచారణ చేపట్టింది. పక్కా పథకం ప్రకారమే ముందుగానే ఆందోళనకారులు పట్టణంలోకి చొరబడ్డారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

కూడేరు: మండలంలోని మరుట్ల–1వ కాలనీకి చెందిన కిష్టప్ప కుమార్తె భానుప్రియ(10) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... గురువారం రాత్రి భానుప్రియ నీటిని వేడి చేసేందుకు హీటర్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా షాక్‌కు గురై కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆమె మృతి చెందింది. ఘటనపై సీఐ శివరాముడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
1/1

ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement
 
Advertisement
 
Advertisement