ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ..

Published Tue, May 14 2024 11:05 AM

ఎప్పటికప్పుడు  ఆరా తీస్తూ..

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరులోని జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ సోమవారం పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆరాతీశారు. నిత్యం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులను, సిబ్బందిని నియమించామన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా దానిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అదనపు ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు తరచూ సందర్శించాలని ఆదేశాలిచ్చామన్నారు. పోలీస్‌ సిబ్బంది వృద్ధులు, బాలింతలు, మహిళలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడ్డారన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్ప ఇంకెవరూ ఉండకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చామన్నారు.

● జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరులోని డీకేడబ్ల్యూ, వీఆర్‌ లా, పీజీ కాలేజీ, స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్సార్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, ముత్తుకూరు సర్కిల్‌ వద్ద హైస్కూల్‌, కొండాయపాళెం హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్‌ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివాదాలు జరగకుండా చూడాలని, క్యూలైన్లలోనే ఓటర్లను పంపాలన్నారు.్శ భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, పోలీస్‌ సిబ్బంది కష్టపడి పనిచేశారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement