సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన | Sakshi
Sakshi News home page

సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన

Published Sat, Nov 25 2023 11:56 PM

రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  - Sakshi

రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కాకాణి

గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రాత్మక నిర్ణయాలతో దేశంలోనే ఆదర్శపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీగూడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం అసైన్డ్‌, చుక్కల భూములు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 247 మంది లబ్ధిదారులకు చెందిన 172 ఎకరాలకు మంత్రి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు వస్తే వారి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదన్నారు. రైతులకు మంచి చేయడమే లక్ష్యంగా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు భూ హక్కులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగనన్నకే దక్కుతుందన్నారు. తోటపల్లిగూడూరు మండలంలో 51 మంది రైతులకు 20.29 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములకు డీకేటీ పట్టాలు, నిషేధిత జాబితా నుంచి 54 ఎకరాలను తొలగించి 48 మంది రైతులకు పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్‌ భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన 148 మంది రైతులకు 97 ఎకరాలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలను అందించామన్నారు. అర్హులైన పేదలు, రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తుంటే మాజీ మంత్రి సోమిరెడ్డి కోర్టులకు వెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. సోమిరెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోలేడన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, తోటపల్లిగూడూరు సొసైటీ చైర్మన్‌ కావల్‌రెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు, విత్తనాభివృద్ధి సంస్థ అథారిటీ రాష్ట్ర సభ్యులు కోటా శేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు టంగుటూరు పద్మనాభరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement