ప్రాణం తీసిన ఈత సరదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Published Sat, May 25 2024 5:25 PM

ప్రాణం తీసిన ఈత సరదా

నీట మునిగి బాలుడు మృతి

నర్సాపూర్‌ రూరల్‌: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృత్యువాత పడిన ఘటన నర్సాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని హనుమంతపూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై పుష్పరాజ్‌, స్థానికుల కథనం మేరకు.. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన చాంద్‌ పాషా, ఉస్మాన్‌ బీ దంపతుల కుమారుడు ఆసీఫ్‌(12) స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు హనుమంతపూర్‌ చెరువులోకి వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో ఆసీఫ్‌ నీట మునిగి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్‌ తెలిపారు.

మంజీరాలో మునిగి వ్యక్తి..

పాపన్నపేట(మెదక్‌): ప్రమాదవశాత్తు మంజీరాలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రామతీర్థం శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని జయపురం గ్రామానికి చెందిన బజారు కిష్టయ్య (35) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సమీప బంధువుల పెళ్లి నిమిత్తం రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలిసి రామతీర్థం గ్రామానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం స్నానం చేసేందుకు బంధువులతో కలిసి మంజీరానది వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా కిష్టయ్య ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే ఉన్న బంధువులు గమనించి కాపాడేందుకు యత్నించినా సాధ్య పడలేదు. పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య మమతతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement