Sakshi News home page

ఆలు.. దిగాలు!

Published Thu, Jan 18 2024 7:02 AM

నాగలితో భూమిలో నుంచి ఆలుగడ్డ పంటను తీస్తున్న రైతు - Sakshi

జహీరాబాద్‌ : ఆలుగడ్డ సాగుచేసిన రైతు ఈ ఏడాది డీలా పడ్డాడు. వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకుని పంటను సాగు చేస్తే పెట్టుబడి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం ప్రాంతంలో అత్యధికంగా ఆలును సాగు చేస్తుంటారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 4వేల ఎకరాల్లో పంట సాగైనట్లు అధికారులు అంచనా వేశారు. నెల రోజులుగా పంటను తీయడం ప్రారంభించారు. కానీ దిగుబడి ఆశాజనకంగా లేక పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరానికి 15 బస్తాలు (50కిలోల సంచి) ఆలు సాగుకు విత్తనంగా ఉపయోగిస్తారు. విత్తనం బస్తా ఒక్కదానికి 12 నుంచి 16 బస్తాల వరకు దిగుబడి వస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం సగటున 8 బస్తాల దిగుబడి మాత్రమే వస్తుంది. కొందరు రైతులకు ఐదు బస్తాలు, మరికొందరికి ఏడు బస్తాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో కొందరికి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ధర కొంతమేర నయమే..

మార్కెట్లో ఆలుగడ్డకు కొంత మేర మంచి ధరే పలుకుతోంది. క్వింటాలు ధర రూ.1,400 నుంచి రూ.1,500 వరకు పలుకుతుండటంతో రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. జహీరాబాద్‌ ప్రాంతంలో పంట తీసే సమయంలో ఆగ్రా నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు ఆలుగడ్డ ఉత్పత్తులు రాకపోవడం వల్లే ధర ఎక్కువగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో ఆగ్రా నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు ఆలు రానుందని, దీంతో ధరలు పతనమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఉత్పత్తులు ఫిబ్రవరి నెలాఖరు వరకు మార్కెట్‌కు తరలుతాయి.

వాతావరణంలో మార్పు

ఈ ఏడాది ఆలు సాగుకు వాతావరణం అనుకూలంగా లేదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలలోపు ఉన్నట్లయితేనే ఈ పంటకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కానీ ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి పడిపోవడానికి కారణమైందంటున్నారు. పంట వైరస్‌ బారిన పడడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

ముందస్తు సాగుతో..

రైతులు ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లోనే ఆలుగడ్డ సాగు చేయడం వల్ల పంటకు తగిన ఉష్ణోగ్రతలు లేవని, దీంతో దిగుబడులు రాలేదని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్‌ చివరి వారం నుంచి నవంబర్‌ మూడో వారం వరకు పంట సాగు చేసుకోవడమే మేలని చెబుతున్నారు. గత ఏడాది ముందస్తు పంటను వేసుకున్న రైతులకు మార్కెట్లో మంచి ధర వచ్చింది. నవంబర్‌లో సాగు చేసుకున్న వారికి ధర లభించక నష్టపోయారు. దీంతో ఈ ఏడాది రైతులు ముందస్తు సాగు వైపు మొగ్గుచూపారు.

దిగుబడి రాక రైతులు డీలా

అనుకూలించని వాతావరణం

ముందస్తు సాగుతో నష్టాలు

పెట్టుబడి కూడా రాని వైనం

Advertisement
Advertisement