తలపడిన ‘కారు’, ‘ఏనుగు’.. | Sakshi
Sakshi News home page

తలపడిన ‘కారు’, ‘ఏనుగు’..

Published Mon, Nov 20 2023 4:28 AM

-

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాదారణ కార్యకర్తలే ఆ పార్టీకి బలమైన ఆధారం. 1952 నుంచి 1983 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. 1983లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హవా కొనసాగింది. ఇలాంటి సమయంలో కూడా పట్నం ఓటర్లు హస్తం పార్టీకే పట్టం కట్టారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీకి 1985 ఎన్నికల్లో చెక్‌ పెట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొండ్రు పుష్పలీల ఎమ్మెల్యేగా గెలిచి.. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం అభ్యర్థి మస్కు నర్సింహ విజయం సాధించారు.

తలపడిన ‘కారు’, ‘ఏనుగు’..

మూడోస్థానానికి పరిమితమైన ‘సైకిల్‌’

నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటివరకు టీడీపీలో కొనసాగిన కిషన్‌రెడ్డి 2015లో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీడీపీ పరిస్థితి నావికుడు లేని పడవలా తయారైంది. 2018 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు మహాకూటమిగా ఏర్పడ్డారు. పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో సామ రంగారెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. కిషన్‌రెడ్డి, రంగారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. కేవలం 356 ఓట్ల మెజార్టీతో కిషన్‌రెడ్డి గెలుపొందారు. మహాకూటమి అభ్యర్థి రంగారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Advertisement
Advertisement