దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. | Sakshi
Sakshi News home page

దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా..

Published Tue, Nov 14 2023 12:28 AM

రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు - Sakshi

● ఉపాధివేటలో పోయిన ఊపిరి ● యువకుడి మృతితో రోడ్డున పడ్డ కుటుంబం ● బండపల్లిలో విషాదం ● విరాళాలు అందిస్తున్న గ్రామ యువకులు

చందుర్తి(వేములవాడ): ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశానికి వెళ్లిన యువకుడి శవమై ఇంటికి తిరిగొచ్చాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. మండలంలోని బండపల్లికి చెందిన రేగుల బాబు(39) గత డిసెంబర్‌లో జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. ఇరువై రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. అక్కడ వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గలేదు. రెండు, మూడు రోజుల్లో ఇంటికొస్తానని భార్యకు వారం క్రితం ఫోన్‌ చేసి చెప్పాడు. పరిస్థితి విషమించి బా బు శుక్రవారం మృతి చెందాడు. ఈ అతని స్నేహితులు ఫోన్‌ ద్వారా బాబు భార్య కల్యాణికి ఫోన్‌లో తెలపడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. బాబు శవపేటిక సోమవారం బండపల్లికి చేరింది. తండ్రి శవాన్ని చూసి కూతురు, కుమారుడు, భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది.

చిన్ననాటి నుంచి కష్టాలే..

బాబు చిన్నతనంలోనే తండ్రి లచ్చయ్య మృతి చెందడంతో తల్లి లచ్చవ్వ గ్రామంలో చిన్న హోటల్‌ నడిపిస్తూ కుమారుడిని పోషించింది. బాబు పదోతరగతి చదువుతుండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న బాబు బంధువులు పెళ్లి చేశారు. స్వగ్రామంలో చిన్నాచితక పనులు చే సుకునేవాడు. ఇటీవల అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జ్వరంబారిన పడి గత శుక్రవారం మృతిచెందాడు.

ముందుకొచ్చిన యువకులు

బాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ యువకులు ముందుకొచ్చారు. మృతుడికి పదమూడేళ్ల కూతురు రష్మిత ఉంది. ఆమె చదువుల కోసం యువకులు రూ.50వేలు జమచేశారు. మరింత మొత్తం జమచేసి అందజేసేందుకు యువకులు ప్రయత్నిస్తున్నారు.

బాబు(ఫైల్‌)
1/1

బాబు(ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement